రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్‌ది

రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్‌ది– మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఎర్రజొన్న రైతులు ఆందోళన చేస్తే కాల్పులు జరిపి, కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. రైతా ంగాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేంటూ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు గతంలో ఇచ్చిన హమీలను తుంగలో తొక్కి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి పసుపు బోర్డు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు తన హయాంలో ఆ బోర్డు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన బీజేపీ ఎన్నికల్లో రైతుల ఓట్ల కోసం ప్రధానితో అబద్ధపు ప్రకటన చేయించిందని విమర్శించారు. అడ్రస్‌ లేని బోర్డును ఆకాశంలో చూపెట్టి లబ్ది పొందేందుకు
ఆ రెండు పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వగా, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. రైతు బంధు, రైతు భీమా, ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోలు తదితర అనేక రైతు పథకాలను ద్విగిజయంగా గత సర్కార్‌ అమలు చేసిందని గుర్తు చేశారు.
దాన్యం కోనుగోళ్ల కోసం రోజుల తరబడి మార్కెట్లలో పడిగాపులు పడుతూ రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రుణమాఫీపై దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ రైతులను రేవంత్‌ మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఓట్ల రాజకీయాలు మానుకొని వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Spread the love