కవితను అరెస్ట్‌ చేయం అని ఎప్పుడూ చెప్పలేదు

Kavitha will not be arrested Never said– ట్రయల్‌ కోర్టు ముందు ఈడీ వాదనలు
– నిబంధల ప్రకారమే ఆమెను అరెస్ట్‌ చేశాం
– బెయిల్‌ పిటిషన్‌ పై తదుపరి విచారణ వాయిదా
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేయాలని తామెప్పుడూ చెప్పలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రౌస్‌ అవెన్యూ కోర్టుకు వెల్లడించింది. గతంలో సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై గతేడాది సెప్టెంబర్‌లో విచారణ సందర్భంగా … తర్వాతి 10 రోజులు లేదా విచారణ తేదీ వరకు మాత్రమే ఆమెను సమన్లను పంపమని తాము చెప్పినట్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టత ఇచ్చింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం మరోసారి ట్రయల్‌ కోర్టు ముందు వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్‌ న్యాయవాది నితీష్‌ రాణా, మోహిత్‌ రావులు, ఈడీ తరపున జోహెబ్‌ హుస్సేన్‌లు వాదనలు వినిపించారు. మహిళను సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్‌ చేశారన్న పిటిషనర్‌ వాదనలపై జోహెబ్‌ హుస్సేన్‌ అభ్యంతరం తెలిపారు. కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో దర్యాప్తు సంస్థలు తన ఇంటికి వచ్చి విచారణ చేయాలని కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకానీ అరెస్ట్‌ చేయవద్దని ఎక్కడా కోరలేదని వాదించారు. అరెస్ట్‌ విషయంలో సుప్రీంకోర్టు కూడా కవితకు అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. అయితే కవిత అరెస్ట్‌ తర్వాత నాలుగు రోజులకు అంటే మార్చి 19న సుప్రీంకోర్టులో మరోసారి ఈ పిటిషన్‌ విచారణకు వచ్చిందన్నారు. అయితే పిటిషనర్‌ తరపు న్యాయవాది సుప్రీం ఆదేశాలను ఈడీ ఉల్లంఘించిందని, కవితను అక్రమంగా అరెస్ట్‌ వాదించలేదన్నారు. ఎలాంటి అంశాలు లేవనెత్తకుండా ‘ఓన్లీ పిటిషన్‌ విత్‌ డ్రా’ చేసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారన్నారు. దీన్ని బట్టి చూస్తే, కవితది అక్రమ అరెస్ట్‌ కాదని వారు అంగీకరించినట్టే అభిప్రాయపడాల్సి ఉంటుందన్నారు.
ఈడీకి ఎలాంటి పరిధి ఉండదు
ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జాతీయ దర్యాప్తు సంస్థ అని, ఈ సంస్థకు ఎలాంటి పరిధి ఉండదని ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు కొనసాగించారు. మనీలాండరింగ్‌ నిరోధించేందుకు ప్రత్యేక చట్టం ఉందని, ఈడీ జాతీయ దర్యాప్తు అథారిటీ అని తెలిపారు. రాష్ట్ర పోలీసులకు మాత్రమే పరిధులు ఉంటాయని, వారు ట్రాన్సిట్‌ ఆర్డర్‌ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకానీ ఈడీ అరెస్ట్‌ చేసిన నిందితులను రాష్ట్రాల పరిధి దాటించడానికి ఎలాంటి ట్రాన్సిట్‌ ఆర్డర్‌ అవసరం లేదన్నారు. ఒకవేళ మహిళను సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్‌ చేస్తే.. స్థానిక మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కేవలం ’24 హావర్స్‌ రూల్‌’ మాత్రమే ఈడీకి వర్తిస్తుందని, ఈ నిబంధన ప్రకారం కవితను అరెస్ట్‌ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచినట్టు వాదనలు కొనసాగించారు. ఈ అన్నీ నిబంధనలకనుగుణంగానే కవితను అరెస్ట్‌ చేశామన్నారు. హైదరాబాద్‌లో మార్చి 15న సాయంత్రం 6.26 గంటలకు కవితను అరెస్ట్‌ చేసినప్పుడు సూర్యాస్తమయం అయినట్టు జియోగ్రాఫికల్‌ డేటా(అక్షాంశాలు, రేఖాంశాల) ద్వారా వివరించారు. కానీ ఆమెను సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్‌ చేసినట్టు కోర్టుకు తెలిపారు. అరెస్ట్‌కు ముందు దాదాపు 20 నిమిషాలు కవిత అరెస్ట్‌ కాపీ చదివి, సంతకం చేసినట్టు వివరించారు. అంతేకానీ సూర్యాస్తమయం తర్వాత మహిళను అరెస్ట్‌ చేస్తే మెజిస్ట్రేట్‌ అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు.
అరుణ్‌ పిళ్లై కవితకు బినామీ
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరుణ్‌ పిళ్ళై కవితకు బినామీగా వ్యవహరించారని ఈడీ వాదనలు కొనసాగించింది. కవిత తరపున ప్రతినిధిగా మాత్రమే పిళ్లై వ్యవహరించారని ఆరోపించారు. లిక్కర్‌ కేసులో కవిత పాత్రపై అరుణ్‌ పిళ్లై స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు తెలిపారు. దినేశ్‌ అరోరా రూ. 100 కోట్ల వ్యవహారంపై విచారణ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారన్నారు. బుచ్చిబాబు ఫోన్లోని నోట్స్‌ లో లిక్కర్‌ స్కాం వ్యవహారంపై మరింత సమాచారం దొరికిందని వెల్లడించారు. తొలుత కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన పిళ్లై..ఆ తర్వాత తన స్టేట్‌మెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారన్నారు. అయితే ఈడీ వాదనలపై కవిత తరపు న్యాయవాది నితీశ్‌ రాణా అభ్యంతరం తెలిపారు. రిమాండ్‌ సమయంలో సెక్షన్‌ 50 స్టేట్‌మెంట్‌ వర్తించదని ఇటీవల హైకోర్టు ఆదేశాలిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము దాఖలు చేసే రిజాయిండర్‌లో సమగ్ర వివరాలను పొందుపరుస్తామన్నారు. అయితే, నగదు లావాదేవీలు, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు బెయిల్‌ నిరాకరించిన కేసులను ఈడీ న్యాయవాది హుస్సేన్‌ మెన్షన్‌ చేశారు. నగదు లావాదేవీలు, కుట్ర ఈ రెండు అంశాలు లిక్కర్‌ కేసులో అరెస్టైన కవితకు వర్తిస్తాయన్నారు. కవిత బెయిల్‌ పిటిషన్‌ పై ఈడీ తరపున సుదీర్ఘ వాదనలున్నాయని కోర్టుకు తెలిపారు. ఈడీ వాదనలపై తాము కౌంటర్‌ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొన్న స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా.. తదుపరి వాదనలను బుధవారం (నేడు) మధ్యాహ్నం 2 గంటలకు వింటామని వెల్లడించారు.

Spread the love