కవితకు చుక్కెదురు..

Drops to the poem..– బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు
– ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సూచన
– కవిత నిందితురాలు కాదు.. బాధితురాలే
– లిక్కర్‌ పాలసీపై దర్యాప్తు సంస్థల తీరు సరికాదు
 – పార్టీలను, నేతలను లొంగదీసుకునేందుకే ఈడీ దాడులు
– కవిత, కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికం : బీఆర్‌ఎస్‌ ఎంపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కవితకు బెయిల్‌ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేసింది. లిక్కర్‌ స్కాంలో ఈడీ అరెస్ట్‌, కస్టడీని సవాల్‌ చేస్తూ కవిత సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, అనంతరం సీబీఐ స్పెషల్‌ కోర్టు కస్టడీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్దమని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కవిత తరపు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, విక్రమ్‌ చౌదరీలు తమ వాదన వినిపించారు. తొలుత సిబల్‌ వాదనలు ప్రారంభిస్తూ… హైకోర్టుకు వెళ్లాలని మాత్రం సూచించొద్దని ధర్మాసనాన్ని కోరారు. కవితకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి స్టేట్మెంట్‌ను ఈడీ అప్రూవర్ల నుంచి సేకరించింది తప్ప, ఒక్క చిన్న ఎవిడెన్స్‌ కూడా దర్యాప్తు సంస్థల దగ్గర లేదని అన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కవితను నిందితురాలిగా ఈడీ పేర్కొనలేదని, కానీ కవిత అరెస్ట్‌ రిపోర్ట్‌లో మాత్రం ఆగస్టులో కవితకు వ్యతిరేకంగా పలు ఆధారాలను చూపిందని తెలిపారు. మాగుంట రాఘవ్‌ ఇచ్చిన స్టేట్మెంట్‌ ఆధారంగా ఆమెను నిందితురాలిగా పేర్కొంటున్నట్లు వివరించారు. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుత పరిణామాలు తమను కొంత కలిచి వేశాయన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, ఉద్వేగానికి గురి కావొద్దని సూచించారు. బెయిల్‌ విషయంలో ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అయితే జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ విషయంలో ట్రయల్‌ కోర్టుకు వెళ్తే ఏం జరిగిందని సిబల్‌ వాదనలు కొనసాగించారు. ట్రయల్‌ కోర్టులో ఏం జరగడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన ధర్మాసనం, కవిత రాజకీయ వ్యక్తి అయ్యినంత మాత్రాన ఆమె పిటిషన్‌ను నేరుగా స్వీకరించలేమని స్పష్టం చేసింది.
మధ్యలో కవిత తరపు మరో న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదిస్తూ… కవిత దాఖలు చేసిన గత పిటిషన్‌ అంశాలను ప్రస్తావించారు. ఆ పిటిషన్‌ పై విచారణ సందర్బంగా కవితను అరెస్ట్‌ చేయబోమని ఈడీ హామీ ఇచ్చిందని, అయితే అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై జస్టిస్‌ బేలా ఎం త్రివేది స్పందిస్తూ… కవిత వేసిన ఆ పిటిషన్‌ పై ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లేదన్నారు. తరువాత 4, 5 సార్లు విచారణ వాయిదా పడిందని గుర్తు చేశారు. ఈ సమయంలో ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదని, దీంతో ఈడీ ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఇంటర్‌ లింకింగ్‌ ఏర్పడిందని అన్నారు. ఈ నెల 19న ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చిన సందర్భంలోనూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా, పిటిషన్‌ ఉపసంహరించు కున్నారని అన్నారు. మరోవైపు కవిత పిటిషన్‌లో లేవనెత్తిన రాజ్యాంగపరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో కవిత పిటిషన్‌ పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఈడీ సమాధానంపై రిజాయిండర్‌ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు మరో ఆరు వారాల సమయం ఇచ్చింది.
కవిత నిందితురాలు కాదు.. బాధితురాలే
ఎమ్మెల్సీ కవిత నిందితురాలు కాదని, బాధితురాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు పేర్కొన్నారు. ప్రయివేటీకరణకు అనుబంధంగా పాలసీలు మారినప్పుడు, ఆకర్షణీయంగా ఉన్న విధానాలను బట్టి వ్యాపారం చేసేందుకు ఎవరైనా వస్తారని బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు అన్నారు. అలాంటి ఆకర్షణ రీతిలో ఉన్న లిక్కర్‌ పాలసీపై ఈడీ వ్యవహరిస్తోన్న తీరు సరికాదన్నారు. లిక్కర్‌ స్కాంలో కవిత, కేజ్రీవాల్‌ అరెస్ట్‌లను ఖండిస్తూ శుక్రవారం నాడిక్కడ బీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, వద్ది రాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన తరువాత పాలసీలు మార్చుకుంటాయని, కొత్త చట్టాలు తెస్తాయని అన్నారు. లిక్కర్‌ విధానం అనేది ఢిల్లీ సర్కార్‌ తెచ్చిన గవర్నమెంట్‌ పాలసీ అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కూడా గత పదేండ్లలో బొగ్గు గనులు, ఎయిర్‌ పోర్ట్‌లు, రోడ్లను ప్రయివేటీకరించిందని చెప్పారు. అయితే దేశ చరిత్రలో తొలిసారి కేంద్రంలోని అధికార పార్టీ పెద్ద ఎత్తున రాజకీయ కక్ష సాధింపునకు పూనుకుందని విమర్శించారు. అందులో భాగంగానే కవిత, కేజ్రీవాల్‌ అరెస్ట్‌ జరిగిందన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను బలహీనం చేసి, లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎన్డీఏలో మొదటి నుంచి మిత్ర పక్షంగా ఉన్న శివసేన, అకాళీదల్‌ను కూడా బీజేపీ ఇబ్బందిపెట్టిందని గుర్తు చేశారు.
లొంగని నేతలు, పార్టీలపై కక్ష సాధింపు… కేఆర్‌ సురేశ్‌ రెడ్డి
బీజేపికి లొంగని రాజకీయ పార్టీలు, పొలిటికల్‌ లీడర్లపై రాజకీయ కక్ష స్పష్టంగా కనిపిస్తుందని కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈడీ సోదాలు రీజనల్‌గా జరిగాయని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటిని ఢిల్లీకి తీసుకొచ్చారని ఆరోపించారు. కవితకు డబ్బు ముట్టినట్టు, ఆమె ఖాతాలో పడ్డట్టు ఎక్కడ ఆధారాలు లేవన్నారు. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కవితకు న్యాయ జరుగుతుందని అన్నారు. ఒకవైపు శక్తి పేరిట మహిళా లోకాన్ని గౌరవిస్తామని చెబుతోన్న మోడీ, మరో పక్క అదే ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థలు రాత్రి పూట మహిళైన కవితను అరెస్ట్‌ చేశాయని చెప్పారు.
రెండేండ్లు సాగదీత : వద్ది రాజు
ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు అంశాన్ని దాదాపు రెండేండ్లుగా బీజేపీ సర్కార్‌ టీవీ సీరియల్‌లాగా సాగదీసిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తద్వారా లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో కేవలం 150 -200 సీబీఐ, ఈడీ కేసులు ఉంటే… గత పదేండ్లలో ఆ కేసుల సంఖ్య 2954కు పెరిగిందని వివరించారు. కవిత బాధితురాలే కానీ, నిందితురాలు కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను రిమోట్‌గా వాడుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలని చూస్తోందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఢిలీపై ఈడీ అరెస్‌ల పేరుతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

Spread the love