న్యూయార్క్ : అమెరికా చరిత్రలో మొట్ట మొదటి సారి ప్రతినిధుల సభ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన కెవిన్ మెకార్థీ ప్రతినిధుల సభ స్పీకర్‌గా తొమ్మిది నెలల క్రితమే ఎన్నికయ్యారు. మెకార్థీ పదవీచ్యుతుడు కావటానికి ప్రధాన కారణం సొంత పార్టీకే ప్రాతినిధ్యంవహిస్తున్న మట్ గెయిట్జ్. మెకార్థీని తొలగింపుకుగాను ఓటింగ్ జరగటానికి ముందు ఆయన తొలగింపు ఆవశ్యకతను గూర్చి సోషల్ మీడియాలో మట్ గెయిట్జ్ తీవ్ర ప్రచారం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రతిష్టంభన(షట్ డౌన్) సమస్యను అధిగమించేందుకు ప్రతినిధుల సభ ఆమోదించవలసిన ప్రభుత్వ వ్యయంలో ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని కూడా కలపటం కోసం మెకార్థీ ప్రతిపక్ష డెమోక్రాట్లతో రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని గెయిట్జ్ ఆరోపిం చాడు. అమెరికా రుణ సంక్షోభం గురించి ఆయన మాట్లాడాడు. మెకార్థీ తన పార్టీ కే అబద్దాలు చెబు తున్నాడని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అవినీతి పై విచారణ జరపటానికి మెకార్థీ ఏమాత్రం ఆసక్తి చూపటం లేదని కూడా గెయిట్జ్ ఆరోపించాడు. ఈ కారణాలచేతనే మెకార్థీని స్పీకర్ పదవి నుంచి తప్పించవలసి వచ్చిందని ఆయన అన్నాడు.
అయితే ప్రతినిధుల సభలో ప్రతిపక్షమైన డెమోక్రాట్లు మెకార్థీని రక్షించటానికి ప్రయత్నించ లేదు. ఓటింగ్‌లో 208మంది డెమోక్రాట్లు మెకార్థీని వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో 216-210 ఓట్లతో మెకార్థీ తన పదవిని కోల్పోయాడు. కనీసం ఎనిమిది మంది రిపబ్లికన్ ప్రతినిధులు తమ పార్టీ ప్రతినిధి, స్పీకర్ మెకార్థీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. (ఐదుగురు ఓటు వేసినా సరిపోతుంది). పైకి ఇది రిపబ్లికన్ పార్టీలో ఏర్పడిన సంక్షోభంగా కనపడుతుంది. ఒకవేళ ప్రభుత్వం షట్ డౌన్ అయితే, చట్టాల ఆమోదం ప్రక్రియ స్తంభిస్తే, ఆర్థిక వ్యవస్థ మరింతగా కుదేలయితే డెమోక్రాట్లకు వీటన్నిటినీ ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీమీదకు తోసే అవకాశం వస్తుంది. అయితే ఉక్రెయిన్‌కు చేస్తున్న వందల బిలియన్ల ఆర్థిక, ఆయుధ సహాయాన్ని ముగించటానికి ఈ సంక్షోభాన్ని రెండు పార్టీలు కలిసి వాడుకునే సాధ్యత కూడా ఉంది. ఉక్రెయిన్‌లో పెచ్చు మీరిన అవినీతి కారణంగా ఆ దేశానికి అపరిమితం గా చేస్తున్న సహాయాన్ని కొనసాగించ జాలమనే ఆలోచన అధ్యక్ష భవనంకు ఉందన్న సమాచారాన్ని గూఢచార వర్గాలు లీక్ చేశాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంవత్సరంలో ఉక్రెయిన్ కు వందల కోట్ల డాలర్లు సహాయం చేయటంపైన తీవ్రతరమౌతున్న బేధాభిప్రాయాల ప్రభావం అమెరికా రాజకీయాలపైన ఉంటుంది.
ఈలోపు ఈ రాజకీయ నాటకంలో ఎవరి పాత్రలను వారు పోషిస్తున్నారు. ఒకవైపు డెమో క్రాట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ‘ఆటలు ఆపి’ ఉక్రెయిన్‌కు కావలసిన అదనపు 24బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆమోదించాలని బైడెన్ అమెరికన్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేశాడు. ఈ సహాయాన్ని ఆమోదిస్తే ఉక్రెయిన్‌కు అమెరికా ఇప్పటివరకు 137బిలియన్ డాలర్ల సహాయం అందించినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బైడెన్‌కు, ఇతర డెమోక్రాట్లకు ప్రజామోదం 30శాతంకంటే తక్కువగా ఉంటోంది. అమెరికన్ కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభకు ఎవరు స్పీకర్ అవుతారనే విషయంపైన అనేక పుకార్లు ఉన్నాయి. అమెరికన్ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతినిధుల సభకు స్పీకర్ కావటానికి సాంకేతికంగా సభలో సభ్యుడు కానవసరం లేదు. డోనాల్డ్ ట్రంప్‌ను స్పీకర్‌గా చేయటమూ ఒక సాధ్యత అనే పుకారు ఉంది. ఏమైనప్పటికీ ఉక్రెయిన్‌కు అమెరికా అపరిమితమైన సహాయాన్ని అందించే పరిస్థితి ఉండకపోవచ్చు.