నిరంతర చైతన్య ప్రవాహం… బాలగోపాల్‌

Continuous flow of consciousness... Balagopalబాలగోపాల్‌ మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువల న్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు ఆలోచన పరులందరి అంత చైతన్యంలో నిత్యచైతన్య దీప్తిగా వెలుగొందుతూనే ఉన్నాడు. విద్యార్థి దశలో తత్వ చింత నాసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం తదనంతర కాలంలో ఒక వడగాలిలా సాగింది. దినదిన ప్రవర్ధమానమై అనేక రంగాలకు విస్తరించి, సాధారణ మానవులకు గోచరించని అనేక కొత్త విషయాలను ఆవిష్కరించింది. ఆ రకంగా చూసిన ప్పుడు ఆయనది ఒక అసాధారణమైన అరుదైన వ్యక్తిత్వం. అంత అసాధారణమైన, సృజనాత్మకమైన, నిబద్దతతో కూడిన వ్యక్తిత్వం కావడం వల్లనే అది దేశవ్యాప్తంగా అనేక మందిని నేటికీ ఉత్తేజపరుస్తూ ఉన్నది. సామాజిక రాజకీయ రంగాలలోకి ఆయన ఆసక్తి విస్తరించిన తర్వాత ఆయా రంగాల్లో, ఆయా ఉద్యమాలతో ఆయన మమేక మైన తీరు అసాధారణ మైనది. ఆనాడు తన పదునైన మేధాశక్తితో వేసిన అంచనాలన్నీ నేడు వాస్తవాలుగా తేలుతున్నాయి. ఆనాడు క్రమంగా విస్తరిస్తున్న హిందూత్వ ఫాసిస్టు భావజాలం ప్రమాదాన్ని ముందే పసిగట్టి హెచ్చరిస్తే మనం అంత తీవ్రంగా పరిగణిం చనే లేదు. నేడది ఒక కఠిన వాస్తవంగా మరి మన హక్కుల్ని కాలరాస్తుంటే, రాజ్యాంగ విలువలను కూల దోస్తుంటే నిశ్చేష్టులమై చూస్తూ ఉండిపోతున్నాం.
ఆయన మరణించే నాటికి సాంఘిక మాధ్య మాల విస్తృతి పెద్దగా లేకపోవటం కారణంగా, అవి ప్రజా భిప్రాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేయగలవన్న విషయంలో బాలగోపాల్‌ విశ్లేషణ మనకు లభించడం లేదు. తర్వాత సమాజంపై సోషల్‌ మీడియా ప్రభావం క్రమంగా పెరిగి, భారతదేశ రాజకీయాల్ని, ప్రజల రాజకీయ అభిప్రాయాల్ని సైతం ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగిన తరువాత సంభవించిన పరిణామాల్ని విశ్లేషణ చేయడంలో, వాటిని ముందే పసిగట్టడంలో బాల గోపాల్‌ విశ్లేషణ, అతని అంచనా ఎలా ఉండేది? అన్న ప్రశ్న ఈనాటికి ఆసక్తి దాయకమైనదే. 2014 తరువాత భారతదేశంపై ఫాసిస్టు కొండచరియ విరిగి పడే నాటికి, రెండు మూడు సంవత్సరాల ముందు, అటు తర్వాత కూడా సోషల్‌ మీడియాను వాడుకొని ఉత్తర భారతదేశపు ప్రజాభిప్రాయాన్ని హిందుత్వ భావజాలానికి అనుకూలంగా మార్చటంలో సంఫ్‌ు పరివార్‌ గణనీయమైన విజయం సాధించింది. అదే విధంగా దక్షిణ భారతదేశంలో సైతం తన ఉనికిని పెంచుకోవడానికి, రాజకీయంగా కాలు మోపటానికి కర్నాటక రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి, అది అనుసరించిన విభజన, హత్యారాజకీయాన్ని అమలు చేసింది.
మత విద్వేషంపై, మూఢ నమ్మకాలపై, మత దుర భిమానంపై ఆధారపడి రాజకీయాల్ని నడిపే హిందూ త్వశక్తులకు వ్యతిరేకమైన, హేతువాద భావజాలానికి ప్రతినిధి అయిన నరేంద్ర దబోల్కర్‌ను, వామపక్ష భావజాలానికి ప్రతినిధి అయిన గోవిందు పన్సారెను, రాజ్యాంగ విలువలకు, విభజన రాజకీ యాలకు వ్యతి రేకంగా అలుపెరుగని పోరాటం చేసిన గౌరీలంకేశ్‌ను, సాంస్కృతిక, తాత్విక రంగంలో హిందుత్వ భావజాలాన్ని తన లోతైన విశ్లేషణల ద్వారా, పరిశోధనల ద్వారా దునుమాడిన ఎంఎం కల్బుర్గిని హత్య చేసి తమ భావజాలానికి ఎదురు లేకుండా చేసుకునే వ్యూహాన్ని హిందూ ఫాసిజం అమలు చేసింది. ఇలా క్రమక్రమంగా బలం పెంచుకుంటూ పోయి, మత దురభిమానాన్ని రెచ్చ గొట్టి, దేశ ప్రగతికి మైనారిటీలే కారణమనే తప్పుడు సమా చారాన్ని పెద్దఎత్తున సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసి తనకు గణనీయమైన ఓటు బ్యాంకును హిందుత్వ శక్తులు సృష్టించుకోగలిగాయి. ఉత్తర భారతదేశంలో గోరక్షణ పేరుతో వందలమంది మైనారిటీలను హత్య చేసి, మత విశ్వాసాలను రాజకీయాలతో కలగలిపి అధికారానికి సోపానంగా మార్చుకున్నాయి హిందుత్వ శక్తులు.
అపరిమిత వేగంతో అమలు చేసిన ప్రయివేటీ కరణ ద్వారా గాని, అవినీతిని, ఉగ్రవాదాన్ని నిర్మూలి స్తామని చెప్పి చేసిన నోట్ల రద్దు ద్వారా గాని సామాజిక రంగంలో ఏ రకమైన అనుకూల ఫలితాలను రాబట్టు కోలేకపోయిన హిందూత్వ శక్తులు, తరచుగా మత పరమైన అంశాలను, భావోద్వేగాలను రెచ్చ గొట్టి, 2014 నుంచి ఆ విషయాల పైననే చర్చ జరిగే ట్లుగా ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. అయోధ్య నుంచి మొదలుకుంటే జ్ఞానవాపి మసీదు వివాదం దాకా, ట్రిపుల్‌ తలాక్‌ విషయం నుంచి మొదలు కుంటే హిజాబ్‌ వివాదం దాకా చర్చ మొత్తం మతపరమైన విషయాల చుట్టూ తిరిగేట్లుగా ప్రతిసారి సమస్యను హిందూ త్వశక్తులే ముందరికి తీసుకు రావడం, దానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు ప్రతి స్పందించడమే ఈ తొమ్మిదేళ్ల కాలంలో జరుగుతూ వస్తూ ఉన్నది. అభివృద్ధి విషయంలో గానీ, ఉపాధి కల్పన ప్రాతిపదికన గాని, ప్రజారోగ్య ప్రాతిపదికన గాని సాధించిన అభివృద్ధి ఏమిటో ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా చర్చకు రాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం గడిచిన తొమ్మిదేండ్లలో ఎప్పుడు ప్రధానమైన అంశంగా మారలేదంటే పరిస్థితి ఎంతగా దిగ జారిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజల సామూహిక వివేచనను ఇంతగా దృష్టి మళ్లించి వారి రాజకీయ అభిప్రాయాలను ఇంతగా పక్కదారి పట్టించగలిగే పకడ్బంధీ వ్యూహాన్ని సోషల్‌ మీడియా ద్వారా అమలు చేయగలగటం ఎట్లా సాధ్య మైంది? ఇది ఇంకెంత కాలం కొనసాగగలదు? అన్న ప్రశ్నలకు కర్నాటకలో ఇటీవలి ఎన్నికల ఫలితాలు ఓ రకంగా సమాధానం చెబుతూనే ఉన్నాయి. అయిన ప్పటికీ బాలగోపాల్‌ ఉండి ఉంటే ఆయన ఈ పరిస్థి తిని ఎలా వివరించి ఉండేవారు అన్న కుతూహలం సామాజిక చైతన్యం ఉన్న ఎవరికైనా కలగక మానదు. హిందూత్వ శక్తుల తప్పుడు ప్రచారపు బుట్టలోపడ్డ ఒక గణనీయమైన ప్రజా సమూహం ప్రభావం భా రత ఎన్నికల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం వారిలో మాత్రమే ఉన్న అభిప్రాయంగా కాక ఉన్నత స్థానాల్లో ఉన్న, ప్రధాన ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటికి నేతృత్వం వహిస్తూ ఉన్న వ్యక్తుల్లోకి సైతం ఇంకి పోవటం వల్ల క్రమంగా స్వతంత్రంగా వ్యవహరించ వలసిన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటి కుప్పకూలుతున్న చప్పుడు, రాజ్యాంగాన్ని ప్రేమించే రాజ్యాంగ నైతికతకు కట్టుబడే ఎవరికైనా ఆందోళన కలిగించే విషయమే.
తన రచనల్లో సనాతన ధర్మం వర్ణాశ్రమ ధర్మం గురించి లోతుగా విశ్లేషించి మనల్ని ఎంతో చైతన్య పరిచాడు బాలగోపాల్‌.
నిన్నటికి నిన్న ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మా నికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే మొట్ట మొదటిసారి హిందుత్వ శక్తులు ప్రతిస్పందించే విధం గా చేసింది. ఇప్పటివరకు గత తొమ్మిదేళ్లుగా జరిగిన చర్చలో బంతి ఎప్పుడు ప్రజాస్వామ్యవాదులు ప్రతి పక్షాల కోర్టులోనే ఉంటూ ఉండేది. ఉదయనిధి వ్యాఖ్యల ద్వారా మొదటిసారి బంతి హిందుత్వ శక్తుల కోర్టులో పడి వారు ప్రతిస్పందించాల్సి వచ్చింది. గత నాలుగు నెలలుగా మత విద్వేషకీలల్లో రగిలిపోతున్న మణిపూర్‌, వారి కుటిల రాజకీయాలకు తాజా ఉదా హరణగా నిలుస్తూ ఉన్నది. ఇరువురు మహిళల నగ ఊరేగింపు ఆనక వారిపై జరి గిన సామూహిక అత్యాచారం మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన. మత ప్రాతిపదికన ప్రజల్ని విభజించి ఒకరిపై ఒక రిని ఎగదోసి ఆ మంటల్లో వందలాది మందిని హత్య చేయగలిగే విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తూ ఉన్న హిందూత్వ శక్తులకు మణిపూర్‌ తాజా ప్రయోగ శాలగా మారింది. మానవత్వాన్ని బలిపెట్టి అధికారాన్ని నిలబెట్టుకునే ఈ వికృత క్రీడకు హిందూత్వ శక్తులు తెగబడటం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్నదానికి ఒక సూచిక.
అయితే ప్రజాచైతన్యం జాగృతమై, ఆవశ్యక సమస్యలపై ప్రశ్నించడం మొదలుపెడితే, ఇన్నాళ్లు చర్చను పక్కదారి పట్టించి, దృష్టి మళ్లింపు రాజకీయా లకు పాల్పడుతున్న మతతత్వశక్తుల ఆటలు సాగవని మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. కర్నాటకలో అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కొనసాగించిన విభ జన రాజకీయాలతో, పరిపాలన విధానంతో విసిగి పోయిన ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తులు తమ వంతు బాధ్యతను, సామాజిక మార్పునకు తాము నిర్వహించ వలసిన కర్తవ్యాన్ని నిర్వహిస్తే జరిగేది ఏమిటో మనకు ఎన్నికల ఫలితాలు సూచించాయి. అయితే ప్రమాదం ఇంతటితో ముగిసిపోలేదు. ఎందుకంటే మతతత్వ శక్తులు గత పదిహేనేళ్లుగా కొనసాగిస్తున్న విద్వేష ప్రచారానికి బలి అయిపోయి, మత దురాభిమానాన్ని, పరమత విద్వేషాన్ని వంట పట్టించుకున్న వ్యక్తులు అకస్మాత్తుగా ఎన్నికల ఫలితాలు తారుమారు కాగానే అదృశ్యమై పోరు, అలాగే వారికి ఉన్న విద్వేష మత రాజకీయ అభిప్రాయాలు మారిపోవు. ఇప్పటికీ వారు ఉత్తర భారతదేశంలో పని చేసినట్టుగానే కర్నాటక లోనూ పనిచేస్తున్నారు. ఆ మాట కొస్తే దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తూనే ఉన్నారు. వారు ప్రవహింప జేస్తున్న తప్పుడు సమాచారపు ఊబిలో పీకల్లోతు మునిగిపోయి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన సమూహం ఇంకా ఈ దేశంలో అలాగే ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ దేశపు ప్రజాస్వామిక వాదులు చేయవలసిన కఅషిని మనకు విశ్లేషణా పూర్వకంగా ఎవరైనా చెప్పగలిగితే బాగుండునని అనిపించనివారు ఉండరు. ఈ ఊహ కలిగిన మరుక్షణం మనకు గుర్తు కొచ్చే అతి కొద్దిమంది ప్రగతిశీల మేధావుల్లో బాలగో పాల్‌ ముందు వరుసలో ఉంటాడు.ఎన్నికలు సమీపి స్తున్న వేళ మంచేదో, చెడోదే తెలుసుకుని, ఆయన ఆశయ సాధనకు పునరంకితం అవ్వాల్సిన సమయమిది.
(అక్టోబర్‌ 08న బాలగోపాల్‌ వర్ధంతి)
– టి.హరికష్ణ, 9494037288

Spread the love