ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కడ్తాల్ మండల కేంద్రంలోని అపర్ణ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-ఆమనగల్
శ్రీ అపర్ణ పెద్దమ్మ దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలోని శ్రీ అపర్ణ పెద్దమ్మ దేవాలయాన్ని శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ముఖద్వారం లాంటి అపర్ణ పెద్దమ్మ దేవాలయాన్ని ఆధ్యాత్మిక విడిదితో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా విద్యా వైద్యం ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు. పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా 9 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్టు ఆయన గుర్తు చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలైన దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నట్టు సుంకిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు దేవాలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, మహేష్, రమేష్, వెంకటయ్య, బాలయ్య, రాఘవేందర్, శ్రీను, వెంకటేష్, శేఖర్, యాదయ్య, నరసింహ, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.