దళితబంధులో అవినీతి దుమారం..!

– లబ్ధిదారుల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్‌ తీసుకున్నారు..
– దీనిపై విచారణకు అధికారపక్ష సభ్యుల డిమాండ్‌
– ప్రభుత్వం పంచిన భూములనూ ప్లాట్లు చేసి విక్రయించారని ఆరోపణ
– అనేక గ్రామాల్లో భగీరథ నీరు సరఫరా కావడం లేదని ఆగ్రహం
– గరంగరంగా సాగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం
– పలువురు ప్రజాప్రతినిధులు, సభ్యులు, అధికారుల గైర్హాజరు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
సాధారణంగా సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు సమస్యలు లేవనెత్తడం చూస్తుంటాం. కానీ తాజాగా నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ సభ్యులే పలు సమస్యలను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులతో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన సమస్యలు లేవనెత్తారు. ముఖ్యంగా తొలి విడతలో 249మందికి అందజేసిన దళితబంధు పథకంలో బోథ్‌ నియోజకవర్గంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని చింతల్‌బోరిలో 13మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా 12మందికి డబ్బులు తీసుకొని అందజేశారని.. ఇదే గ్రామానికి చెందిన కాంబ్లే భీంరావు డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఆయన పేరును జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఇవి వాస్తవమని..కాదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. యూనిట్ల స్థాపనలోనూ పారదర్శకత లోపించిందని.. అప్పటిప్పుడు గొర్రెలు, మేకలను తీసుకొచ్చి చూపించారని అధికారులు వెళ్లిపోగానే తిరిగి అదే స్థానానికి పంపించారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తాంసి జడ్పీటీసీ తాటిపెల్లి రాజు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దళితబంధులో డబ్బులు తీసుకోవడానికి ఎవరు అవకాశం ఇచ్చారని ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌ రూంల నిర్మాణంలోనూ అవినీతి చోటుచేసుకుందని వివరించారు. బజార్‌హత్నూర్‌ జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య మాట్లాడుతూ ఈ దళితబంధు వ్యవహారంలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేయగా.. మరో సభ్యుడు గోక గణేష్‌రెడ్డి మలి విడతలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరోపక్క దళితబస్తీ పథకంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని భీంపూర్‌ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌ పేర్కొన్నారు. గడ్డి కూడా మొలకెత్తని భూములను ఎస్సీలకు పంపిణీ చేశారని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించారని ఆరోపించారు. కొందరికి భూమిని చూపించకుండానే పట్టా జారీ చేశారని మూడేండ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని అసహానం వ్యక్తం చేశారు. నేరడిగొండ జడ్పీటీసీ అనిల్‌జాదవ్‌ మాట్లాడుతూ నేరడిగొండ మండలం కుంటాల రహదారికి సమీపంలో ప్రభుత్వం ఎస్సీలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను కొందరు వ్యక్తులు ప్లాట్లు చేసి విక్రయించారని పేర్కొన్నారు. అధికారులు ఓ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ దళితబంధు పథకంపై విచారణ జరిపిస్తామిన హామీనిచ్చారు. మరో విడతలో అందజేసిన ఈ పథకంపై పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
భగీరథ నీరు రావడం లేదు
జిల్లాలో చాలా గ్రామాల్లో భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని పలువురు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని రోజుల తరబడి తాగునీరు సరఫరా కావడం లేదని తలమడుగు, ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్‌ జడ్పీటీసీలు ప్రస్తావించగా.. నార్నూర్‌, గాదిగూడ మండలాల్లోనూ తాగునీటి సమస్య ఉందని ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టడం లేదని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారి అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుందని సమాధానం ఇవ్వగా.. సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని తాగునీటి సమస్య ఉన్నట్లు నా దృష్టికి కూడా వచ్చిందని.. ఆయా గ్రామాల్లో సమస్యపై రోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. రోజువారీగా సరఫరా..ఫిల్టర్‌బెడ్ల వద్ద పరిస్థితి సక్రమంగా ఉందా లేదా అనేది చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు వైద్యఆరోగ్యం, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఐటీడీఏశాఖల సమీక్ష నిర్వహించగా.. మధ్యాహ్నం తర్వాత వ్యవసాయం, ఉద్యానవనం, మైనింగ్‌ తదితరశాఖల ప్రగతిపై సమీక్షించారు.

సమన్వయంతో సమస్యలు పరిష్కారం : రాథోడ్‌ జనార్దన్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని..వాటిని సక్రమంగా లబ్ధిదారుల దరికి చేర్చే బాధ్యత అధికారులపై ఉంది. జూన్‌ 24 నుంచి ప్రభుత్వ పోడు పట్టాలు పంపిణీ చేయనుంది. ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఆయా శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలి.

Spread the love