కౌన్‌ బనేగా ఎమ్మెల్యే..?

కౌన్‌ బనేగా ఎమ్మెల్యే..?– కంచుకోటలో ఎర్రజెండా రెపరెపలు
– భద్రాచలం నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ
నవతెలంగాణ-వెంకటాపురం
ప్రజా బలంతో సీపీఐ(ఎం) దూసుకుపోతుంటే.. ధన బలంతో ఎట్లాగైనా సీటు సాధించాలని గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు భద్రాచలం నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు బీసీ, దళితబంధు కమీషన్లు శాపంలా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద భద్రాచలం నియోజకవర్గంలో ముక్కోణపు పోరు నడుస్తోంది.
భద్రాచలం నియోజకవర్గం పేరు చెబితే సీపీఐ(ఎం) కంచుకోట అని గుర్తుకు వస్తుంది. 1978 నుంచి 1983 వరకు ముర్ల ఎర్రయ్య రెండు సార్లు, 1985 నుంచి 1994 వరకు మూడు పర్యాలు కుంజా బొజ్జి, 1999, 2004, 2014లో సున్నం రాజయ్య హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా సీపీఐ(ఎం) నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజనలో భాగంగా పట్టున్న చింతూరు, కూనవరం, వీఆర్కేపురం, భద్రాచలం రూరల్‌ మండలాలు ఆంధ్రాలోకి వెళ్లాయి. కుంజా బొజ్జి, సున్నం రాజయ్య వారసునిగా సీపీఐ(ఎం) నుంచి పోటీలో ఉన్న కారం పుల్లయ్యకు ఉద్యమాల చరిత్ర ఉంది. గిరిజన సంఘం నాయకునిగా, పోలవరం, పొడుభూములపై చేపట్టిన పోరాటాలు కలిసి వచ్చే అంశాలు. భద్రాచలం నియోజకవర్గంలో 1952 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో 5 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుపొందారు. 1957లో పీవీ రావు, 1967లో కన్నయ్య దొర, 1972లో రామచంద్రయ్య, 2009లో కుంజా సత్యవతి, 2018లో పొడెం వీరయ్య గెలుపొందారు. కాగా, దళితబంధు ఎంపికలో కమీషన్ల పర్వం బీఆర్‌ఎస్‌కు ప్రతికూల అంశంగా మారింది.
గులాబీ తహతహ..
తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి భద్రాచలం గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తహతహలాడుతున్నా నేటికీ సాధ్యం కాలేదు. 2014లో మానే రామకృష్ణను బరిలో నిలిపినా కనీసం పోటీ కూడా ఇవ్వని పరిస్థితి. 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్న డా||తెల్లం వెంకట్రావు.. పొడెం వీరయ్యపై 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023లోనూ తిరిగి వెంకట్రావు టిక్కెట్‌ దక్కించుకున్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలో బలమైన బీసీ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది బీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చ నడుస్తోంది. మూడు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా ఉంది.

Spread the love