పోరు గ‌డ్డ‌ పాలేరు ప్రగతి జాడ ఎర్రజెండా

– పాలేరు క’న్నీటి’ కష్టాలపై చట్టసభల్లో కమ్యూనిస్టుల గళం
– భూపతిరాజు మొదలు బాజీ హన్మంతు వరకు..
– వెంకట వీరయ్య నుంచి ఎంపీగా తమ్మినేని వరకు..
– పాలేరు అభివృద్ధితో కమ్యూనిస్టుల విడదీయలేని బంధం
– పాలేరు ప్రగతి జాడలు చూసింది కమ్యూనిస్టుల పాలనలోనే..
– చట్టసభల్లో ప్రజల తరఫున గొంతు విప్పింది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, ఎంపీలే.. తలాపున పాలేరు..
తడి ఆరిన గొంతులు.. నెర్రలు వారిన చెరువులు.. నోళ్లు తెరిచిన పంటచేలు.. 1962 నుంచి అనేక ఏండ్లపాటు పాలేరు నియోజకవర్గం వివిధ పార్టీల ఏలుబడిలో ఉంది. కానీ ఎర్రజెండా నీడలోనే ప్రగతి జాడలు చవి చూసింది. రైతుకూలీల పక్షాన చట్టసభల్లో గళం విప్పిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అతికొద్దిమంది ఉంటే వారిలో కమ్యూనిస్టుల గొంతే బిగ్గరగా వినిపించింది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే హాట్‌ సీటుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పాలేరు నియోజకవర్గం 2009 సంవత్సరానికి పూర్వం ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం. అప్పట్లో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాలతో కూడిన ఈ నియోజకవర్గం.. ఇప్పుడు ముదిగొండ మధిర సెగ్మెంట్లోకి పోగా.. ఒకప్పుడు ఖమ్మం అసెంబ్లీలో భాగంగా ఉన్న ఖమ్మం రూరల్‌ మండలం ఇప్పుడు పాలేరులోకి చేరింది. 1962 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో 15సార్లు ఎన్నికలు జరగ్గా, మూడుసార్లు కమ్యూనిస్టు పార్టీలు విజయం సాధించాయి. దీనిలో రెండుసార్లు సీపీఐ(ఎం) గెలుపొందింది. నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్‌ గెలుపొందగా, 2016 ఉప ఎన్నికలో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఇదీ ఈ నియోజకవర్గ రాజకీయ స్వరూపం.
కమ్యూనిస్టుల 12 ఏండ్ల పాలనలోనే..
1983లో సీపీఐ(ఎం) బలపరిచిన సీపీఐ అభ్యర్థి భీమపాక భూపతిరావు, 1985లో సీపీఐ(ఎం) నుంచి బాజీ హన్మంతు, 1994లో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. 1996లో తమ్మినేని వీరభద్రం ఎంపీగా ఉన్న సమయంలోనే ప్రజా సమస్యలపై పాలేరు గొంతు చట్టసభల్లో వినిపించింది.
క’న్నీటి’ కష్టాలు తీర్చిన కమ్యూనిస్టులు..
కృష్ణానది ఎడుమ కాలువ నీటిని నిల్వ చేసేందుకు నెలకొల్పిన పాలేరు రిజర్వాయర్‌ నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోనే ఉంది. కానీ చుట్టుపక్కల ప్రాంతాలు అనేక ఏండ్లపాటు క’న్నీటి’ కష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పాలేరు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుమ్ముగూడెం ప్రాజెక్టు సాధన కోసం 2003-04లో 2,668 కి.మీటర్ల పాద యాత్ర నిర్వహించారు. తద్వారా కృష్ణా నది నీటితోనే కాకుండా గోదావరి జలాలను కూడా రప్పించి బీడు భూములకు నీరందించాలనే ప్రయత్నం సాగించారు. ఫలితంగానే నేడు పేరు మార్చుకొని సీతారామ ఎత్తిపోతల పథకంతో ఎన్నెస్పీ స్థిరీకరణకు బీజం పడింది. పాలేరు పాత కాల్వకు 12వ కి.మీటర్‌ దగ్గర సాగర్‌ ప్రధాన కాల్వ నుంచి పైపులైన్‌ వేయడం ద్వారా పాత కాల్వ చివరి భూములకు నీరందించొచ్చని సీపీఐ(ఎం) అనేక పోరాటాలు చేసింది. అసెంబ్లీలోనూ గళం వినిపించింది. అనేక లిఫ్ట్‌లు, చెక్‌డ్యాంలు కమ్యూనిస్టుల పాలన సమయంలోనే నిర్మాణమయ్యాయి.
రైతుకూలీలకు బాసటగా..
కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉన్న కాలంతోపాటు లేని సమయంలోనూ రైతు, కూలీల కోసం పోరాటాలు సాగాయి. ప్రజావాణి వినిపించారు. కూసుమంచి మండలంలో పదివేల ఎకరాలు, నేలకొండపల్లిలో 15వేల ఎకరాలకు సాగు నీరందక చెరకు, వరి పంటలు ఎండిపోతున్న సమయంలో కమ్యూనిస్టులు రైతుల పక్షాన పోరాడారు. నీరందక పంటలు ఎండిపోవడంతో అటు రైతులు ఎకరానికి రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోగా.. ఇటు కూలీలు రోజుకు రూ.300 నుంచి రూ.500 కూలి నష్టపోయిన విషయాన్ని చట్టసభల దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వరంగంలో ఉన్న రాజేశ్వరపురం చక్కెర కర్మాగారాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పోకుండా విశ్వప్రయత్నం చేశారు. ఇలా రైతు, కూలీల తరఫున ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా చట్టసభల్లో ఎర్రజెండాలు గళం వినిపించాయి.
ప్రజల పక్షాన పోరాటాలు
కమ్యూనిస్టులు చట్టసభల్లో లేనప్పటికీ ప్రజా పోరాటాల్లో నిరంతరం ముందున్నారు. నియోజకవర్గంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, కొరవి- కోదాడ జాతీయ రహదారి, డోర్నకల్‌ – మిర్యాలగూడ, డోర్నకల్‌- సూర్యాపేట మీదుగా వెళ్లే రైల్వేలైన్‌ల అలైన్‌మెంట్‌ మార్పించడంలో కమ్యూనిస్టుల పోరాటం ఎడతెగనిది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే భూ నిర్వాసితులకు అంతో ఇంతో మేలు జరిగింది. భూములు, ఆస్తుల నష్టం తక్కువగా ఉండేలా అలైన్‌మెంట్‌ మార్పించడంలో కమ్యూనిస్టుల పోరాటాలు కీలకంగా మారాయి. అలాంటి కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే ఇంకా ఎంతో మేలు జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది.

Spread the love