– మున్సిపల్ చైర్‌పర్సన్ హస్తగతానికి ప్లాన్
– అవిశ్వాసం నేపథ్యంలో 30న నేరుగా మున్సిపల్‌కు..
నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ నిట్టు జాహ్నావిపై అవిశ్వాస తీర్మానం పెడుతూ పలువురు కౌన్సిలర్లు.. కలెక్టర్‌కు 15 రోజుల క్రితం నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లను ప్రత్యేక శిబిరానికి తరలించారు. ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఉన్న కౌన్సిలర్ల ఫొటోలు గురువారం కలకలం రేపాయి. మున్సిపల్ కౌన్సిలర్ల క్యాంప్‌ను డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా ఖర్చు మాత్రం ఉరదొండ వనిత రవి భరిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే కౌన్సిలర్లందరూ వనితకి మద్దతు తెలుపుతారా? లేకా ఇందూప్రియకు పట్టం కడతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, అవిశ్వాసంపై ఉత్కంఠ రేపుతున్న కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎవరనేది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతుందని ఆ పార్టీలోని కొందరి నాయకుల చర్చ. ఇప్పటికి 12 రోజుల నుంచి కౌన్సిలర్లు క్యాంప్‌లో ఉండగా.. ఇప్పటి వరకు ఎవరిని చైర్‌పర్సన్ చేయాలనే ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ చెప్పకపోవడంతో కౌన్సిలర్లందరూ ఉరదొండ వనిత వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.