పిరికి ప్రధాని

– బీజేపీ భయపడుతున్నది.. అందుకే వేధిస్తున్నది
– దమ్ముంటే నాపై కేసు పెట్టండి
– మోడీ ప్రభుత్వతీరుపై గళమెత్తే సమయం ఆసన్నమైంది : కాంగ్రెస్‌ ‘సంకల్ప సత్యాగ్రహ’లో ప్రియాంక గాంధీ
– ఢిల్లీలో రాజ్‌ఘాట్‌ వద్ద నిరసన
– పాల్గొన్న పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు
– రాహుల్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని బీజేపీ కుట్ర : ఖర్గే
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎంపీగా రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ‘సంకల్ప సత్యాగ్రహ’ను చేపట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో రాహుల్‌ అనర్హత వేటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటలకే ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి.
ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి (రాజ్‌ఘాట్‌) వద్ద కాంగ్రెస్‌ సంకల్ప సత్యాగ్రహను నిర్వహించింది. రాజ్‌ఘాట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయనే కారణంగా అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు కాంగ్రెస్‌ కార్యాలయానికి లేఖ రాశారు. రాజ్‌ఘాట్‌ ప్రాంతంలో సెక్షన్‌ 144 విధించినట్టు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ సత్యాగ్రహను చేపట్టింది.
తొలుత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, నేతలు కె.సి వేణుగోపాల్‌, ప్రమోద్‌ తివారి, రాజీవ్‌ శుక్లా, అధీర్‌ రంజన్‌ చౌదరి వంటి అగ్రనాయకులు రాజ్‌ఘాట్‌ చేరుకొని మహాత్మా గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో
జరిగే ‘సంకల్ప సత్యాగ్రహ’ యాత్రలో పాల్గొన్నారు.
బీజేపీపై ప్రియాంక తీవ్ర ఆగ్రహం
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ మోడీ సారథ్యంలోని బీజేపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబంపై నిరంతరం దాడులు చేస్తూ, కాశ్మీర్‌ పండిట్‌ వారసత్వాన్ని అవమానిస్తూనే ఉన్నదని మండిప డ్డారు. రాహుల్‌ను ”అమరవీరుని కుమారుడు”గా అభివర్ణిస్తూ, ఆయనను (రాహుల్‌) ప్రతిరోజూ అవమానిస్తూ, చివరకు నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేదని అన్నారు. ”మీరు నా సోదరుడు, అమరవీరుని కుమారుడిని ద్రోహి అంటున్నారు. మీర్‌ జాఫర్‌తో పోలుస్తున్నారు. మీరు ఆయన తల్లిని అవమానించారు. మీ ముఖ్యమంత్రే స్వయంగా రాహుల్‌కు అతని తల్లి ఎవరో తెలియదంటూ వ్యాఖ్యానించారు. మీరు నా కుటుంబాన్ని ప్రతిరోజూ అవమానిస్తూనే ఉన్నారు. అయినా ఎవరిపైనా ఒక్క కేసూ నమోదు కాలేదు. ఎవరినీ జైలుకు పంపలేదు. సభ్యత్వాన్ని రద్దు చేయలేదు” అని ప్రియాంక అన్నారు.
దమ్ముంటే…నాపై కేసుపెట్టండి.
ఇప్పటి వరకు మేం మౌనంగా ఉన్నామనీ, అందుకే మీరు మా కుటుంబాన్ని అవమానిస్తూనే ఉన్నారని ప్రియాంక గాంధీ అన్నారు. ” మీరు ఒక మనిషిని ఎంత అవమానిస్తారని నేను అడగాలనుకుంటున్నాను. నాపై కేసు పెట్టండి. ఈ దేశ ప్రధాని పిరికివాడు అన్నది మాత్రం నిజం” అని ఆమె వ్యాఖ్యానించారు..
రాహుల్‌ను ఎంతగా హేళన చేసినా…
రాహుల్‌ గాంధీ తన విద్యాభ్యాసం రెండు ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థలైన హార్వర్డ్‌, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పూర్తి చేశారనీ, అలాంటి ఆయనను వాళ్లు (బీజేపీ) పప్పు అని పిలిచారనీ, ఆ తర్వాత ఆయన పప్పు కాదని, సామాన్య ప్రజానీకం సమస్యలపై అవగాహన కలిగిన నిజాయితీ పరుడనే అవగాహన తెచ్చుకున్నారని తెలిపారు. తన సోదరుడు ప్రధాని వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారని, మీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పారని అన్నారు. సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు కానీ ఒకరినొకరు ద్వేషించుకునేంత విద్వేషం మనలో లేదని అన్నారని ప్రియాంక గుర్తు చేశారు. తన తండ్రిని పార్లమెంటులో అవమానించారనీ, సోదరుడికి మీర్‌ జాఫర్‌ అనే పేరు పెట్టారనీ, ఇలా.. ఎన్నో సార్లు వాళ్లు తమ కుటుంబాన్ని అవమానించినా మౌనంగానే భరిస్తూ వచ్చామని చెప్పారు. ”మీ ప్రధానే స్వయంగా నెహ్రూ పేరుపై వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ పండిట్ల కుటుంబం మొత్తాన్ని ఆయన అవమానపరిచారు. తండ్రి చనిపోయిన తరువాత ఆయన కుటుంబం పేరును కొడుకు ముందుకు తీసుకెళ్లే సంప్రదాయం ఈ దేశంలో ఉంది” అని ఆమె అన్నారు.
రాహుల్‌ గాంధీ వేసే ప్రశ్నలకు బీజేపీ భయపడుతున్నదనీ, అందుకే ఆయనను వేధిస్తున్నదని విమర్శించారు. ఇటువంటి అహంకారపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే సమయం ఆసన్నమైందని ఆమె చెప్పారు. సంకల్ప సత్యాగ్రహ యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పి.చిదంబంరం, సల్మాన్‌ ఖుర్షీద్‌, అజరు మాకెన్‌, ముకుల్‌ వాస్నిక్‌, పవన్‌ కుమార్‌ బన్సల్‌, జైరాం రమేష్‌, ప్రతిభా వీరభద్ర సింగ్‌, జెడి శీలం, కుమారి సెల్జా తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే : ఖర్గే
ఈ సందర్భంగా మల్లికార్జన్‌ ఖర్గే మాట్లాడుతూ.. ” నీరవ్‌ మోడీ ఓబీసీనా? మెహుల్‌ చోక్సీ ఓబీసీనా? లలిత్‌ మోడి ఓబీసీనా? వీళ్లంతా పరారీలో ఉన్నవారు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనంతో పరారైన వ్యక్తుల గురించి రాహుల్‌ ప్రస్తావించారని తెలిపారు. దేశాన్ని, స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాహుల్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని బీజేపీ చూస్తున్నదని, ఆయన గొంతును మూగబోయేలా చేయాలన్నదే బీజేపీ కుట్ర అని అన్నారు. రాహుల్‌ గాంధీకి బాసటగా నిలిచిన అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love