హానికర ద్రవం తాగిన క్రికెటర్.. ఆసుపత్రిలో చికిత్స

నవతెలంగాణ హైదరాబాద్: హానికర ద్రవం తాగడంతో భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌(Mayank Agarwal) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. త్రిపుర రాజధాని అగర్తల నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో మయాంక్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచే తన మేనేజర్‌ సహాయంతో మయాంక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్‌ కుమార్‌ పలు విషయాలను వెల్లడించారు.
రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌(Mayank Agarwal)  త్రిపురతో జరిగిన మ్యాచ్‌ అనంతరం తన జట్టుతో కలిసి ఢిల్లీ విమానం ఎక్కాడు. మంచినీళ్లు అనుకొని తను కూర్చున్న సీటు ముందు పౌచ్‌లోని ద్రవాన్ని కొద్దిగా తాగాడు. దీంతో వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహచరులు స్థానిక ఐఎల్‌ఎస్‌ ఆసుపత్రికి తరలించారు. మయాంక్‌ గొంతులో వాపు, బొబ్బలు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని, మయాంక్‌కు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని త్రిపుర ఆరోగ్యశాఖ కార్యదర్శి కిరణ్‌ గిట్టె పేర్కొన్నారు.
‘‘క్రికెటర్‌ను ఎమర్జెన్సీలో చేర్పించి చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. నిరంతరం మా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు’’ అని ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సూచనతో త్వరలోనే బెంగళూరుకు తీసుకురానున్నట్లు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ‘‘అగర్తల నుంచి దిల్లీ బయలుదేరిన విమానం మెడికల్‌ ఎమర్జెన్సీతో వెనక్కి వచ్చింది. వైద్యసాయం కోసం ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాం. అనంతరం ఫ్లైట్‌ బయలుదేరింది’’ అని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ పేర్కొంది. భారత జట్టు తరపున 21 టెస్టు లాడిన మయాంక్ ప్రస్తుతం రంజీట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మయాంక్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో 51, 17 పరుగులు చేశాడు. ఈ ఘటనతో సూరత్‌ వేదికగా రైల్వేతో ఫిబ్రవరి 2న జరగనున్న మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

Spread the love