– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– కలెక్టర్, నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి ఆదేశం
నవతెలంగాణ – సత్తుపల్లి
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు ఎండిపోకుండా రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు మళ్లించేందుకు తక్షణమే చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆగస్టు 15న అశ్వాపురం మండలం బిజ్జి కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు మోటార్లను ప్రారంభించి, రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ప్రధాన చెరువులకు నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కాలువలు, కెనాల్‌లకు ఎక్కడైనా గండ్లు పడినా లేదా లీకేజీలు ఉన్నా వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్పష్టం చేశారు. ఆయకట్టు చివరి భూముల వరకు నీరు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.
ఒక ప్రాంతానికి ఎక్కువ నీరు వెళ్లి, మరొక ప్రాంతంలో నీటి కొరత రాకుండా సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అందుబాటులో ఉన్న పరిమిత నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని, కాలువల సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు సాగు చేసిన ప్రతి ఎకరా పంటను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.



