దళిత ఉద్యమాన్ని విస్తృతం చేయాలి

Dalit movement should be broadened– బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో దళితులకు భూపంపిణీ లేదు
– కౌలురైతుల ప్రస్తావనా లేదు…
– బీజేపీ మనువాదంతో ప్రమాదం
– డిసెంబర్‌ 4న చలో ఢిల్లీ జయప్రదం చేయండి : దళిత సమ్మిట్‌ రాష్ట్ర సదస్సులో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దళిత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్త్రుతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత, సామాజిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన దళిత సమ్మిట్‌ రాష్ట్ర సదస్సులో వక్తలు అన్నారు. దీనికోసం అఖిలభారత స్థాయిలో పనిచేస్తున్న సంఘాలన్నింటినీ కలుపుకొని డిసెంబర్‌ 4న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీల మ్యానిఫెస్టోల్లో దళిత అజెండాను చేర్చేలా ఒత్తిడి తేవాలని అన్నారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత, సామాజిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దళిత సమ్మిట్‌ రాష్ట్ర సదస్సు జరిగింది. దళిత్‌ స్టడీస్‌ వ్యవస్థాపకులు మల్లేపల్లి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ నాగయ్య, ఆర్‌ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బీ ప్రసాద్‌, కార్యదర్శులు కొండమడుగు నర్సింహా, నారి ఐలయ్య, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌ వెస్లీ, టీ స్కైలాబ్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎమ్‌యూ) రాష్ట్ర కార్యదర్శి బాలమల్లేష్‌, రాష్ట్ర నాయకులు సృజన్‌కుమార్‌, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌, ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ బొప్పని పద్మ, బీకేఎమ్‌యూ రాష్ట్ర మహిళా కూలీల కన్వీనర్‌ మహాలక్ష్మి, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు బందెల నర్సయ్య, రాష్ట్ర నాయకులు ఏసురత్నం తదితరులు మాట్లాడారు. దళిత ఉద్యమాన్ని ఇతర సామాజిక ప్రజాస్వామిక ఉద్యమాలతో కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితులకు భూ పంపిణీ, కౌలు రైతుల హక్కులు, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అంశాలే లేవన్నారు. భూమి ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుందనీ, కానీ దళితులు రోజువారీగా పెత్తందారులపైనే ఆధారపడాలని పాలకవర్గాలు భావిస్తున్నాయని విమర్శించారు. ఐటీరంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారనీ, దానివల్ల దళితులకు ఒరిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఆ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తున్నదనీ, దీనివల్ల కులవ్యవస్థ మరింత పెరిగి, వివక్ష పెచ్చరిల్లుతుందని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయనీ, వాటిని నియంత్రించే చర్యలు శూన్యమని విమర్శించారు. దళితుల గౌరవప్రదమైన జీవనానికి కేరళ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వారి స్వాభిమానం కోసం అక్కడి ప్రభుత్వం దేవాలయాల్లో అర్చకులుగా కూడా నియమిస్తున్నదని చెప్పారు. దళిత, గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్యకు నోచుకోలేకపోతున్నారనీ, ప్రయివేటు విద్యాసంస్థల్లో దోపిడీ పెచ్చరిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేవారు. రాష్ట్రంలో భూముల రేట్లను భారీగా పెంచేసి, సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ, అటవీ హక్కులు, విద్యాహక్కు చట్టాలు అమలు కావట్లేదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే కుట్రలు చేస్తున్నదని చెప్పారు. అనంతరం 12 డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని స్కైలాబ్‌బాబు సదస్సులో ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమానికి డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్‌ అధ్యక్షత వహించారు.

Spread the love