Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత స్మశాన వాటిక భూమి కబ్జా భగ్గుమన్న దళితులు 

దళిత స్మశాన వాటిక భూమి కబ్జా భగ్గుమన్న దళితులు 

- Advertisement -

ఆక్రమణల ఆరోపణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు..స్థలంలో ఫోరెన్సిక్ అధికారులతో తవ్వకాలు జరుపండి.
నవతెలంగాణ-బాల్కొండ 

చనిపోయిన తర్వాత కూడా తమవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు ఉన్న స్థలం సైతం తమకు దక్కని పరిస్థితి ఏర్పడిందని బస్సాపూర్ గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత గోసంగి స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురవుతోందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 612లో ఉన్న దళిత స్మశాన వాటిక భూమిపై ఆక్రమణ జరుగుతోందని గ్రామానికి చెందిన దళితులు ఆరోపించారు. ఒకే కుటుంబానికి చెందిన తోట పెంటన్న, తోట గణేష్‌లు ఈ భూమిని ఆక్రమించారని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. స్మశాన వాటిక భూమి విషయంలో ప్రశ్నించిన తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘చనిపోయిన తర్వాత కూడా మా హక్కు లేదా?’
స్మశాన వాటిక భూమి కేవలం ఒక భూమి కాదని, తమ పూర్వీకుల అంతిమ సంస్కారాలకు సంబంధించిన హక్కు అని దళితులు పేర్కొన్నారు. గ్రామంలో దళితుల కోసం ఉన్న స్మశాన వాటిక స్థలం క్రమంగా ఆక్రమణకు గురైతే భవిష్యత్‌లో తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలంటూ ప్రశ్నించారు.

“జీవించి ఉన్నప్పుడు వివక్షను ఎదుర్కొంటున్నాం.. చనిపోయిన తర్వాత కూడా మా వారికి చివరి స్థలం లేకుండా చేయడం ఎంతవరకు న్యాయం?” అంటూ దళిత గోసంగి ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలోనూ ఆందోళనలు.. కేసుల ఆరోపణలు
స్మశాన వాటిక భూమిని పరిరక్షించేందుకు గతంలో దళిత గోసంగి కులస్తులు ప్రయత్నించారని, ఆ సమయంలో వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. తమ హక్కు కోసం ప్రశ్నిస్తే కేసులు, బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆరోపించారు.

తక్షణమే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తో విచారణ చేయండి 
సర్వే నంబర్ 612లోని భూమిపై అధికారులు తక్షణమే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తో తవ్వకాలు జరిపించండి సమాధులు వెళ్తే మాది లేకపోతే మీది పూర్తి విచారణ చేయాలి. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి నిష్పక్షపాత విచారణకు ఆదేశించి, దళితుల స్మశాన వాటిక హక్కును కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం రాజేష్, బేడ బుడగ జంగం జనసంఘం జిల్లా అధ్యక్షులు డొక్క రంజిత్, జిల్లా ఉపాధ్యక్షులు సదుల రాజేశ్వర్, మాజీ సర్పంచులు కర్రే లింగస్వామి, కర్రే గంగయ్య, గోసంగి కులస్తులు నడిపి సాయిలు, కర్రే రాజన్న, రాసుల గంగాధర్, గంగయ్య తదితరులతో పాటు సుమారు 50 మంది దళిత గోసంగి కులస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -