భారత్‌లో బియ్యం ఉత్పత్తి తగ్గుదల

Decline in rice production in India– గతేడాదితో పోల్చితే దాదాపు 3 శాతం పడిపోవచ్చు : యూఎస్‌డీఏ అంచనా
న్యూఢిల్లీ: గతేడాదితో పోల్చితే భారత్‌లో బియ్యం ఉత్పత్తి తగ్గొచ్చని అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) అంచనా వేసింది. భారత్‌లో బియ్యం ఉత్పత్తి 2.94 శాతం పడిపోయి నాలుగు మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు తగ్గవచ్చని వివరించింది. 2022-2023కి దిగుబడి 136 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కాగా, 2023-2024 సెప్టెంబర్‌లో యూఎస్‌డీఏ అంచనా దిగుబడి 132 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉన్నది. ఆగస్టు దిగుబడి 134 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉన్నది. 2023-2024 దిగుబడిలో ఖరీఫ్‌, రబీ ఉత్పత్తి రెండూ ఉన్నాయి. అలాగే వేసవి నెలల్లో ఉత్పత్తి చేయబడిన బియ్యం కూడా ఉన్నాయని అంచనాపై ఒక వార్త సంస్త తన నివేదికలో పేర్కొన్నది. యూఎస్‌డీఏ అంచనా ప్రకారం.. భారత్‌లో వరి పండించే ప్రాంతం 47.0 మిలియన్‌ హెక్టార్లు. ఇది గత నెల నుంచి మారలేదు. అలాగే, గత సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం తగ్గటం గమనార్హం. దిగుబడి (కఠినమైన ప్రాతిపదికన) హెక్టారుకు 4.21 టన్నులకు చేరుతుందని అంచనా. 2023 నైరుతి రుతుపవనాలు ఎనిమిదేండ్లలో కనిష్ట స్థాయికి చేరుకోనున్నాయి. సెప్టెంబరు 1 నాటికి భారతదేశానికి, వర్షపాతం లోటు దీర్ఘకాలిక సగటు కంటే కనీసం 8 శాతం తక్కువగా ఉన్నదని నివేదిక పేర్కొన్నది. ఈ రుతుపవనాలలో చాలా వరకు వర్షపాతం అసమానంగా ఉన్నది. ఆగస్టు అత్యంత పొడి నెలలలో ఒకటిగా నమోదు కావటం గమనార్హం. ”యూపీ, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాలతో కూడిన తూర్పున ఉన్న ఇండో గంగా మైదానం ఆందోళన కలిగించే ప్రాంతాలు” అని నివేదిక పేర్కొన్నది.

Spread the love