16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి– ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16న దేశ వ్యాప్త గ్రామీణ బంద్‌, సమ్మెను జయప్రదం చేయాలని బీకేయంయూ, ఏఐఏడబ్ల్యూయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్‌.బాలమల్లేష్‌, ఆర్‌. వెంకట్రాములు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు ప్రసంగించారు. గత పదేండ్లుగా బీజేపీ ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక మతతత్వ విధానాల ఫలితంగా పేదరికం పెరిగి పోతున్నదని తెలిపారు. ”ఆక్స్‌ఫాం” నివేదిక ప్రకారం దేశంలో 80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన మగ్గిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ రైతులకు రాతపూర్వకంగా హామీలు ఇచ్చి వాటిని అమలు పర్చకపోవడం అన్యాయమని అన్నారు. అందరికీ ఉద్యోగ భద్ర కల్పించి ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పని రోజులను 200 రోజులకు పెంచాలని, రోజుకు రూ.800 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో డీబీఎఫ్‌ నవీన్‌, ఏఐఏడబ్య్లూఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.బాబురావు, బీకేయంయూ మేడ్చల్‌జిల్లా అధ్యక్షలు రాములు గౌడ్‌, కార్యదర్శి టి.శంకర్‌, నల్లగొండ జిల్లా అధ్యక్షులు శ్రావణ్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజయ్య, కార్యదర్శి బుద్దుల జంగయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love