దేశ రక్షణే మాధ్యేయం

bv Ragavulu– కేవలం పదిమంది పెట్టుబడిదారుల కోసమే మోడీ సర్కార్‌
– పేదల ఆకలి,హక్కులు ఈ సర్కారుకు పట్టవు
– 2024 ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తాం..
– యుద్ధాలు ఆపకపోతే ఆర్థిక మాంద్యం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌

ప్రజాస్వామిక రక్షణ, పౌరహక్కుల కోసం ‘ఇండియా’ కూటమితో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకుంటామని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్‌ అధ్యక్షతన సీపీఐ(ఎం) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలనలో ఈ దేశంలో 15 నుంచి 20 మంది పెట్టుబడుదారుల ఆస్తులు 16 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. అదానీ, రిలయన్స్‌ పెట్టుబడుదారులు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకొని తక్కువ సమయంలో వేల కోట్లకు పడగలెత్తారని చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, ఆకలి మంటలతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందన్నారు. మైనార్టీ వర్గాలు, ప్రజాస్వామ్య వాదులపై దాడులు, దేశద్రోహ కేసులు పెడుతూ జైలుకు పంపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేసి పౌరహక్కులను హరిస్తోందన్నారు. ప్రశ్నించిన రైతు ఉద్యమ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను జైలుకు పంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. మూడోసారి దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమ్మెలపై కూడా ఎమర్జెన్సీ విధించే ప్రమాదం ఉందన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు ఇండియా కూటమిలోని 28 పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో సీపీఐ(ఎం) ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. దేశంలో 260 పార్లమెంటు స్థానాల్లో బలం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూటమిలోని ఇతర పార్టీలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచంలో అమెరికా గోధుమల వ్యాపారం కోసం, ఆయిల్‌ ఉత్పత్తుల కోసం రష్యా- ఉక్రెన్‌ మధ్య యుద్ధం, ఇజ్రాయిల్‌లో యుద్ధాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. యుద్ధాలను పూర్తిగా ఆపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటుంటే.. మన ప్రధాని నరేంద్ర మోడీనేమో అమెరికాతో స్నేహబంధం కోసం కొన్ని రోజులు ఆపాలని మాత్రమే చెప్పడం సరైనది కాదన్నారు. ప్రపంచ దేశాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని యుద్ధాలు ఆపకపోతే ప్రపంచంతోపాటు దేశంలో కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ ఉత్పత్తులు తగ్గి ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్‌, జిల్లా కార్యదర్శి ఏ.రాములు, సీనియర్‌ నాయకులు ఆర్‌.రాంరెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి, పద్మ, చంద్రకాంత్‌, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love