– ఓటింగ్‌కు అనుమతించని స్పీకర్
– వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
– రాజ్యాంగ ఉల్లంఘన, సమాఖ్య వాదంపై దాడి
న్యూఢిల్లీ : గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 (జీఎన్‌టీసీ)ను కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, హౌం సహాయ మంత్రి నిత్యానంద్ రారు లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ ఆర్డినెన్స్ బిల్లుపై బుధవారం చర్చ జరగనున్నది. తొలిత లోక్‌సభలో కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద్ రారు బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్ష ఎంపీలు స్పష్టంచేశారు. అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి విధానపరమైన అంశాలు సభ ముందుకు తీసుకురాకూడదనీ, ఇది సభా ఉల్లంఘన అవుతుందని విమర్శించారు. ఈ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు అదిర్ రంజన్ చౌదరి, ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్, సౌగత్ రారు, టిఆర్ బాలు, గౌరవ్ గొగోరు, శశిథరూర్, అసదుద్దీన్ ఓవైసి తదితర ఎంపీలు వ్యతిరేకించారు. ఈ బిల్లుతో ఢిల్లీ అసెంబ్లీ ప్రాధాన్యతను, సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ”ఒక రాష్ట్రం హక్కులపై ఈ ప్రభుత్వం చేసిన దారుణమైన ఉల్లంఘనలో భాగమే ఈ బిల్లు. కనుక ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను.
సహకార సమాఖ్య వాదంపై దాడి చేస్తున్నది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వంపై కేంద్రం చేసే యుద్ధం” అంటూ విమర్శించారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఓటింగ్‌ను కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై కేంద్రానికి ఒరిస్సాలోని అధికార బీజేపీ మద్దతుగా నిలిచింది. ఢిల్లీకి సంబంధించి చట్టాలను చేసే హక్కు పార్లమెంట్‌కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొన్నదని చెప్పారు. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందనీ, ఇది రాజ్యాంగంలోనే ఉందని అన్నారు. ఢిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా పార్లమెంటు తీసుకురావచ్చని సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చిందని చెప్పారు. దీనిపై అభ్యంతరాలన్నీ రాజకీయపరమైనవేనని, బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని స్పీకర్‌ను అమిత్ షా కోరారు. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు పెద్దఎత్తున చేసిన నినాదాల హౌరు మధ్య ఆయన సభలో బిల్లు ప్రవేశపెట్టారు. మూజు వాణి ఓటుతో స్పీకర్ ఓం బిర్లా బిల్లును ఆమోదించారు.
ఢిల్లీ బిల్లులో ఏముందీ?
ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు బదులుగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లులో అఖిల భారత సర్వీసులు, కేంద్ర పాలిత డివిజన్ కేడర్ అధికారుల నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు ప్రాధాన్యతనిస్తుంది. మంత్రుల సిఫార్సులను తిరస్కరించే, సవరణలు కోరే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు అన్నీ ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీచే చేయబడుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ సిఫార్సు చేసిన పేర్ల ప్యానెల్ ఆధారంగా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బోర్డులు, కమిషన్‌లకు లెఫ్టినెంట్ గవర్నర్ నియామకాలు చేస్తారని బిల్లులోని కొత్త నిబంధన పేర్కొంది. అయితే ఈ త్రిసభ్య కమిటీలో ఢిల్లీ సీఎంతో పాటు కేంద్ర ప్రభుత్వం నియమించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ చేసిన సిఫార్సులపై లెఫ్టినెంట్ గవర్నర్‌దే అంతిమ నిర్ణయం. అంటే ఇక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి, అసెంబ్లీకి ఎటువంటి అధికారాలు ఉండవు.
ఆర్డినెన్స్‌లోని కొన్ని అంశాలు బిల్లులో తొలగింపు
ఆర్డినెన్స్‌లోని కొన్ని అంశాలు ఈ బిల్లులో తొలగిం చారు. ‘సేవల’పై ఎటువంటి చట్టాన్ని రూపొందించడంలో రాష్ట్ర అసెంబ్లీ పాత్ర లేదని ఆర్డినెన్స్‌లో పేర్కొన్న నిబంధనను బిల్లులో తొలగించారు. ఢిల్లీ ప్రభుత్వం వార్షిక నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని ఆర్డినెన్స్ కింద నిర్దేశించిన అవసరాన్ని బిల్లులో తొలగించారు. ”ప్రతిపాదనలు, అంశాలకు సంబంధించిన మంత్రుల ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి ముందు కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది” అనే నిబంధనను కూడా తొలగించారు. న్యాయ పరిశీలనలో బిల్లు నెగ్గాలంటే, ఆర్డినెన్స్‌లోని ఈ తొలగింపులు తప్పని సరి అని భావించి తొలగించారు.