– సోషలిజాన్ని అదానిజంగా మార్చారు
– సోదరభావం గురించి మాట్లాడితే పాకిస్తాన్‌కు వెళ్లండంటున్నారు
– పాశ్చాత్య దేశాల నాయకుల చేతుల్లో సార్వభౌమాధికారం
– బుల్డోజర్ న్యాయం నడుస్తోంది
– ఉపా, రాజద్రోహంలోనే కనిపిస్తున్న స్వేచ్ఛ
– పార్లమెంట్‌కు ప్రధాని మోడీ హాజరు 0.001 శాతమే : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యాంగ పీఠికలోని ప్రజాస్వామ్యం ఇప్పుడు ‘మోడీస్వామ్యం’, ‘నమోస్వామ్యం’గా మారిందని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యమంటే లెజిస్లేటివ్ కు ఎగ్జిక్యూటివ్ జవాబుదారీతనంగా ఉండాలని, ప్రజలకు లెజిస్లేటివ్ జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. సార్వభౌమాధికారం ప్రస్తుతం పాశ్చాత్య దేశాల నాయకుల (ట్రంప్ టూ బైడెన్) పట్టులో ఉందని, సోషలిజం అదానీజంగా మారిందని విమర్శించారు. రాజ్యసభలో 75 ఏండ్ల పార్లమెంట్ చరిత్రపై జరిగిన ప్రత్యేక చర్చలో సీపీఐ(ఎం) తరపున ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమైనదని అన్నారు. లెజిస్లేటివ్ కు ఎగ్జిక్యూటివ్ జవాబుదారీతనంగా ఉండాలని, కానీ అదిప్పుడు కనబడటం లేదన్నారు. కొత్త పార్లమెంట్‌భవనాన్ని కూడా నిర్మించారని, కొత్తదా, పాతదా సమస్య కాదని, ప్రధాని పార్లమెంటులో ఎంత సమయం గడుపుతారు? అన్నది ప్రధానాంశమని అన్నారు. పార్లమెంట్‌కు ప్రధాని మోడీ 0.001 శాతం మాత్రమే హాజరయ్యారని, ఇంత తక్కువ హాజరు ఉన్న ప్రధాని ఎవ్వరూ లేరని పేర్కొన్నారు. లౌకికవాదం బీజేపీ పదజాలంలో లేదని, బీజేపీ కేంద్ర కార్యాలయంలో చేపలు, మాంసాన్ని మెనూ నుంచి తొలగించినట్లే, లౌకికవాదాన్ని కూడా అలానే చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ కనబడుతుందే గానీ, రాజ్యాంగంలో రిపబ్లిక్ కనబడదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ ప్రవేశిక పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని అన్నారు. బుల్డోజర్ న్యాయం ఇప్పుడు మనపై ఉందని పేర్కొన్నారు. ఆర్థిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే అత్యంత పేదరికం, తీవ్ర అసమానత ఉందని, స్వేచ్ఛ ఇప్పుడు ఉపా, రాజద్రోహంలోనే ఎక్కువగా కనిపిస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి సమానత్వంపై నమ్మకం లేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పాలన కాదని, మైనార్టీల రక్షణ అన్న అంబేద్కర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థ, మీడియా, ప్రభుత్వ సేవ, ఇతర సామాజిక, ఆర్థిక రంగాలలో 20 కోట్ల మంది ముస్లింల ప్రాతినిధ్యం ఎంత? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇండియన్స్ కంటే మొగల్స్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఔరంగజేబు మంత్రివర్గంలో 50 శాతం హిందువులే ఉన్నారని గుర్తు చేశారు. అయితే స్వతంత్ర భారతదేశం మొదటి మంత్రివర్గంలో అన్ని మత వర్గాలకు ప్రాతినిధ్యం ఉందని, ముస్లింలైన మౌలానా ఆజాద్, రఫీ అహ్మద్ కిద్వారు, పార్సీ జాన్ మథారు, సిక్కు అమృతకౌర్‌లను తొలి మంత్రివర్గంలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. మతోన్మాదం, ద్వేషపూరిత ఈ రాజకీయాలు ప్రాతినిధ్య సమానత్వాన్ని నాశనం చేశాయని అన్నారు. మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా ఆజాద్‌ని ఇప్పుడు గుర్తుచేసుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని, ఆయన పేరు మీద ఉన్న స్కాలర్‌షిప్ కూడా రద్దు చేశారని విమర్శించారు.
సోదరభావాన్ని ఇప్పుడు కొత్తగా ఉపయోగిస్తున్నారని, సోదరభావం గురించి మాట్లాడేతే పాకిస్తాన్‌కు వెళ్లండి అంటూ వ్యాఖ్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఈ దేశ పౌరులమని, బీజేపీ వాళ్ల కంటే మేమే అసలైన దేశభక్తులమని అన్నారు. బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా మహాత్మాగాంధీని స్మరించుకోలేదని, ఎందుకంటే ఆయనను హత్య చేసినోళ్లు ఎవరో వాళ్లకి తెలుసని విమర్శించారు. మహాత్మాగాంధీ స్థానంలో సావర్కర్ ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సావర్కర్ జయంతి రోజు పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారని ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ హత్య తరువాత, ఆర్‌ఎస్‌ఎస్ ను సర్దార్ పటేల్ నిషేధించారని గుర్తు చేశారు. ముందుగా మణిపూర్, నుహ్, ముజఫర్‌నగర్‌ల గురించి మాట్లాడాలని అన్నారు. జీ20లో పేర్కొన్న వసుదైక కుటుంబం దేశంలోనే ప్రస్తావనకు వస్తుందా? అని ప్రశ్నించారు. జీ20 దేశాల్లో తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచీ, ఆకలి సూచీ వంటి అన్ని సామాజిక సూచికల్లో భారత్ వెనుకబడి ఉందని అన్నారు.
గ్లోబల్ సౌత్ అనేవారు సౌత్ ఇండియాను అసహ్యించుకుంటున్నారని, మీరు వచ్చి దక్షిణాదిని పాలించి ఉంటే 30-40 శాతం తీవ్ర పేదరికం ఉండేదని అన్నారు. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో 10 శాతం కంటే తక్కువ పేదరికం ఉందని, సోమాలియాగా ప్రధాని మోడీ అభివర్ణించిన కేరళలో పేదరికం శూన్యమని పేర్కొన్నారు. కానీ కేరళను ఆర్థికంగా కేంద్రం కుంగదీస్తుందని బ్రిట్టాస్ విమర్శించారు. కేరళ ఒక రూపాయి కేంద్రానికి ఇస్తే, కేవలం 25 పైసలు మాత్రమే కేరళకు తిరిగి వస్తుందని అన్నారు.