పేదల గుడిసెలు కూల్చివేత

Demolition of poor huts– పరామర్శించడానికి వెళ్లిన సీపీఐ(ఎం) జిల్లా నాయకుని అరెస్టు
– సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
– స్టేషన్‌ ఎదుట బైటాయించి.. బాధిత పేదల నిరసన
నవతెలంగాణ-కంది, సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని 615 సర్వే నెంబర్‌ని ప్రభుత్వ స్థలంలో మూడ్రోజుల కిందట సుమారు 200మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. కాగా, ఆదివారం తెల్లవారు జామున సుమారు మూడు గంటల సమయంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఆ గుడిసెలను కూల్చివేశారు. దాంతో ఉదయం మరోమారు పేదలు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. కాగా విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు ఘటనా స్థలానికి వెళ్లి.. బాధిత పేదలను పరామర్శించారు. ఘటన గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు నర్సింలును అరెస్టు చేసి సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో బాధితులందరూ స్టేషన్‌ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. కాగా నర్సింలు అరెస్టును చూసి పలువురు మహిళలు కంటతడిపెట్టారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా నర్సింలు అరెస్టును సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల గుడిసెలను కూల్చివేయడం అన్యాయమన్నారు. కంది మండల కేంద్రంలో అనేక ఏండ్లుగా పేదలు ఇండ్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా.. ఇండ్లు లేని పేదల గుడిసెలను కూల్చివేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అర్హులైన పేదలను గుర్తించి వారికి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు యన్‌. శ్రీనివాస్‌ పి.అశోక్‌, కృష్ణ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love