తీస్తాకు అనుమతి నిరాకరణ

– ఐఐఎస్‌సీ నిర్వాకం
– సిబ్బంది జోక్యంతో సద్దుమణిగిన వివాదం
బెంగళూరు: నగరంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో విద్యా స్వేచ్ఛకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ‘మత సామరస్యం-న్యాయం’ అనే అంశంపై ప్రసంగించేందుకు వెళుతున్న పౌర హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను బుధవారం సంస్థ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి అధ్యాపకుల జోక్యంతో అనుమతించారు. ఐఐఎస్‌సీలోని ఓ విద్యార్థి సంఘం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా దానికి కొద్ది గంటల ముందు అనుమతి నిరాకరిస్తున్నట్లు సమాచారం పంపారు. చివరికి అధ్యాపకుల జోక్యంతో తీస్తా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వాస్తవానికి ఆడిటోరియంలో కార్యక్రమం జరగాల్సి ఉండగా క్యాంపస్‌లోని ఓ క్యాంటీన్‌ వెలుపల జరపాల్సి వచ్చింది. నలభై మంది విద్యార్థులను ఉద్దేశించి తీస్తా, నలుగురు అధ్యాపకులు ప్రసంగించారు. ‘చాలా రోజుల క్రితమే విద్యార్థి సంఘం అనుమతి తీసుకుంది. అయినప్పటికీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం జరిగింది’ అని ఓ అధ్యాపకుడు తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు చాలా మంది వచ్చారని, అయితే వారిని లోపలికి అనుమతించలేదని ఆయన చెప్పారు. రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించిందని, విద్యా సంస్థలు చర్చలను అడ్డుకునేందుకు ప్రయత్నించడం సబబు కాదని సమావేశానికి హాజరైన మరో సంస్థకు చెందిన అధ్యాపకుడు ప్రధానిల్‌ రారు అన్నారు. కాగా ఈ సమావేశానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ‘బ్రేక్‌ ది సైలెన్స్‌’ అనే విద్యార్థి సంఘం చాలా రోజుల క్రితమే ఐఐఎస్‌సీ అధికారులను కలిసిందని, అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదని ‘టెలిగ్రాఫ్‌’ పత్రిక తెలిపింది. చివరికి సమావేశం జరగాల్సిన రోజు ఓ విద్యార్థికి సమాచారం అందించారని, ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారని వివరించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఐఐఎస్‌సీ ఇలాంటి చర్చా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదు. నటాషా నర్వాల్‌, దేవాంగన కలిగ హాజరవ్వాల్సిన ఓ కార్యక్రమాన్ని కూడా గత నెలలో అధికారులు రద్దు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు 2019లో వీరిద్దరినీ జైలుకు పంపారు. వీరి కార్యక్రమాన్ని రద్దు చేసిన అనంతరం 500 మందికి పైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఐఐఎస్‌సీకి ఓ బహిరంగ లేఖ రాస్తూ విద్యా స్వేచ్ఛకు అటంకాలు సృష్టించవద్దని కోరారు.

Spread the love