త్వరలో ధరణి ఫైల్స్‌

– ఆధారాలతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
– ధరణిలో పెట్టుబడిదారులెవరో కేంద్రం నిగ్గు తేల్చాలి :రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ధరణి పోర్టల్‌ అక్రమాలపై త్వరలో ‘ధరణి ఫైల్స్‌’ విడుదల చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ధరణికి సంబంధించి టెర్రాసిస్‌ కంపెనీ మాత్రమే బయటకు కనిపిస్తున్నదని, కానీ దీని వెనక పెద్ద మాఫియా దాగుందని ఆరోపించారు.దీనికి సంబంధించిన ఆధారాలను సీరియల్‌గా బయటపెడతామనీ, దోపిడీలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని చెప్పారు. ధరణిలో పెట్టుబడిదారులెవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ‘కాంగ్రెస్‌ భూమి డిక్లరేషన్‌’ పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ధరణి రూపేణా ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో బ్రిటిష్‌ ఐల్యాండ్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయన్నారు. ధరణి మొత్తం యువరాజు మిత్రుడు గాదె శ్రీధర్‌రాజు చేతుల్లో ఉందని తెలిపారు. దారి దోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయవుతున్నాయని తెలిపారు. ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారంతా ఆర్థిక నేరగాళ్లు అని ఆరోపించారు. ధరణిలోని అనేక లోటుపాట్లను ఆసరాగా చేసుకుని నిషేధిత జాబితాలోని భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసి వెంటనే ప్రొహిబిషన్‌ లాక్‌ చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ భూములకు యజమానులను సష్టించడం, అనంతరం ఆ భూములను బదలాయించడం, ఆ తర్వాత వాటిని లేఅవుట్లు వేసి అమ్ముకోవడం వంటి తతంగం నడుస్తోందని విమర్శించారు. దేవాదాయ భూములను అక్రమంగా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దాన్ని రద్దు చేయాలంటే కేసీఆర్‌ భయపడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అందులో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతామని వెల్లడించారు.
కాంగ్రెస్‌ భూమి డిక్లరేషన్‌లోని కీలక అంశాలివే…
– లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని ధరణిని రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త కంప్యూటర్‌ రికార్డును రూపొందిస్తాం.
– ఇప్పుడున్న రికార్డు సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం.
– నిషేధిత జాబితా లో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
– అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
– కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశంలోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్‌ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
– వందకు పైగా ఉన్న భూచట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
– కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన అధీకత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
– కాంగ్రెస్‌ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
– 2006లో కాంగ్రెస్‌ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
– కేంద్రం లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తాం. రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్‌ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చేయడానికి రిటైర్డ్‌ జడ్జి ఆధ్వర్యం లో కమిషన్‌ ఏర్పాటు చేస్తాం.
– భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
– భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తాం.

Spread the love