సొసైటీ వ్యవస్థాపకులు.. లింగమల్ల జ్యోతి శంకరయ్య దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎన్‌టీఏ నిర్వహించిన నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలు,అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థులు,నిరుద్యోగ యువత సాధించిన సుదీర్ఘ పోరాటానికి దక్కిన చారిత్రాత్మక విజయమని ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు,నిస్వార్థ సామాజిక సేవా కార్యకర్తలు లింగమల్ల జ్యోతి శంకరయ్య పేర్కొన్నారు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరంతర ఆందోళనలు,యువత అలుపెరగని పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.పేపర్ లీకేజీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను, మాఫియాను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని,కేవలం మంత్రి రాజీనామాతోనే వ్యవహారాన్ని ముగించరాదని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల కారణంగా పరీక్షలు రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు.
అలాగే, జూలై 20న ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులైన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ప్రభుత్వ నియామక, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరగకుండా పార్లమెంట్‌లో కఠిన చట్టం తీసుకురావడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఏ ప్రభుత్వానికైనా యువశక్తి గట్టి సమాధానం చెబుతుందని ఈ పరిణామం నిరూపించిందన్నారు.బాధిత విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు విద్యార్థుల పక్షాన తమ సంఘీభావం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.



