నియంతృత్వం ప్రబలుతుంది

Dictatorship prevails– ప్రజాస్వామ్యానికి ప్రమాదం
– ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపిస్తుంది
– తగ్గే వ్యయం కూడా తక్కువే
– ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’పై నిపుణుల మనోగతం
ప్రజాస్వామిక వ్యవస్థలో ఏదైనా మార్పు చేసేటప్పుడు దానిని కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇతర ప్రజాస్వామిక సంస్థల పైన, మొత్తంగా ప్రజాస్వామ్యం పైన దాని ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. సానుకూల ప్రభావం ఉంటుందని నిర్ధారణకు వచ్చినప్పుడే ముందడుగు వేయాలి. ప్రస్తుతం ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’ వాదనపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీని హేతుబద్ధతపై అధ్యయనం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై నిపుణులు ఏమంటున్నారంటే…
న్యూఢిల్లీ : లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు వేర్వేరుగా ఎన్నికలు జరిపితే వ్యయం తడిసిమోపెడవుతుందని కేంద్ర పెద్దలు ప్రవచిస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల వ్యయం రూ.55 వేల కోట్లు. ప్రపంచంలోనే ఇంత ఖరీదైన ఎన్నికలు జరగలేదని ఆ సంస్థ చెబుతోంది. దేశంలో ఎన్నికల వ్యయాన్ని తగ్గించాలన్న విషయంలో వేరే అభిప్రాయాలకు తావే లేదు. వ్యయాన్ని తగ్గించి, ఆ వనరులను ఆర్థిక వ్యవస్థలోని మరిన్ని ఉత్పాదక రంగాలకు మళ్లిస్తే మేలే జరుగుతుంది. కానీ జమిలి వల్ల నిజంగానే వ్యయం తగ్గుతుందా? లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు వేర్వేరుగా ఎన్నికలు జరిపితే విధుల్లో పాల్గొనే కేంద్ర దళాలు, అధికారులు, సిబ్బంది వాటి కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆ సమస్య ఉండదు. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత సాధ్యపడుతుందన్న వాదన కూడా కేంద్రం చేస్తున్నది. తరచుగా ఎన్నికలు జరుగుతుంటే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రచారానికే పరిమితమవుతారని,. ఇది పరిపాలనపై ప్రభావం చూపుతుందని, ఇన్ని సానుకూలతలు ఉన్నందునే జమిలి ఎన్నికలు నిర్వహించాలని వారు ప్రతిపాదిస్తున్నారు. అయితే వీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
చట్టసభను ముందుగానే రద్దు చేస్తే ?
జమిలి ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఏదైనా కారణంతో లోక్‌సభనో, రాష్ట్రాల శాసనసభలనో ముందుగానే రద్దు చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగియకుండానే సభను మధ్యలోనే రద్దు చేసి, మిగిలిన కాలం కోసం మళ్లీ ఎన్నికలు జరిపితే దానికయ్యే వ్యయం మాటేమిటి? ఖర్చును తగ్గించవచ్చునన్న వాదనలో పస ఏముంటుంది? కాలపరిమితి ముగియని ప్రభుత్వాను జమిలి కోసం రద్దుచేయటం సాధ్యమవుతంది? చాలీచాలని మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు చట్టసభల విశ్వాసం కోల్పోయినా సుస్థిరత, జమిలి పేరుతో అలాగేకొనసాగిస్తారా? అలా చేస్తే అది ప్రజాతీర్పుకు విఘాతం కాదా? దీనికి మన రాజ్యాంగ నియమాలు అనుమతిస్తాయా? అన్నవి కేవలం ప్రశ్నలే కాదు, ప్రజాస్వామ్యానికి సవాళ్ళు.
అవినీతికి బాట
జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్న నార్వేలో అనేక సందర్భాలలో మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడడం, దేశంలో అస్థిర రాజకీయాలు కొనసాగడం, ఫలితంగా అభివృద్ధి కుంటుపడడం, అవినీతి వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైనారిటీ ప్రభుత్వాల పాలనలో పార్టీ ఫిరాయింపులకు, అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నది మనకు అనుభవమే. దేశాన్ని పాలించే పార్టీకి చాలినంత మెజారిటీ లేకపోయినా సభను రద్దు చేయకుండా ‘సుస్థిరత’ పేరుతో అలాగే కొనసాగిస్తే అది అవినీతికి బాట వేయడమే అవుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
ఫెడరల్‌ వ్యవస్థ పైనా ప్రభావం
జమిలి ఎన్నికలు ఫెడరల్‌ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ, జాతీయ అంశాలు కలగాపులగమై ఓటింగ్‌పై ప్రభావం పడుతుంది. రాష్ట్ర స్థాయి సమస్యలు మరుగునపడే ప్రమాదం ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీకే రాష్ట్రాలలో కూడా 77% అవకాశాలు ఉంటాయని 2015లో జరిగిన ఓ సర్వే తేల్చింది.

విడివిడిగా జరిగితే…
జమిలి ఎన్నికల కారణంగా జవాబుదారీతనం లోపించే ప్రమాదం ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ విడివిడిగా ఎన్నికలు జరిపినప్పుడే రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తాయి. ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే పాలకులు తమ లోపాలను సవరించుకొని, ఓటర్ల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాంటివేమీ లేకపోతే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రమాదం ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ వంటి దేశాలలో విడివిడిగా ఎన్నికలు జరిపితేనే ప్రభుత్వాలు, వాటి ఆజమాయిషీలో పనిచేసే సంస్థలు మరింత జాగరూకతతో, జవాబుదారీత నంతో వ్యవహరిస్తాయని అవగతమవుతుంది. జమిలి ఎన్నికలలో కేంద్రంలోనూ, రాష్ట్రాల లోనూ ఒకే పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వాలలో జవాబుదారీతనం తగ్గడంతో పాటు పాలకులలో నిరంకుశ ధోరణులు ప్రబలుతాయి. తద్వారా ప్రజాస్వామ్యానికే ముప్పు ఏర్పడుతుంది.

Spread the love