నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం మున్సిపల్ చైర్ పర్సన్ బిజన బాలమణి భాస్కర్ ప్రారంభించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (నేషనల్ డెవర్మింగ్ డే ) సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, జెఎంజె, ఆర్బిఆర్పి తెర పాఠశాలలలో నులిపురుగుల నివారణ కొరకు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ హైమావతి అన్నారు.
చిన్నారుల్లో నులిపురుగుల నివారణ ద్వారా పోషకాహార లోపం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన చిన్నారికి ఆల్బెండాజోల్ మాత్రలు అందేలా వైద్య, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలు, మిగిలిన అర్హులైన చిన్నారులకు జూలై 20న నిర్వహించే మాప్-అప్ డే రోజు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ సాయి తేజ , మున్సిపల్ కౌన్సిలర్ జూకంటి సంపత్ ,ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



