నవతెలంగాణ కథనంతో కదిలిన యంత్రాంగం… బోర్నపల్లిలో అక్రమ ఇసుక డంపులు సీజ్
-తహసీల్దార్ నాగార్జున చర్యలు..
-మైనింగ్ శాఖ మౌనం
-సీజ్ చేసిన ఇసుకను బహిరంగ వేలం వేయాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ-రాయికల్
గోదావరి నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతోందంటూ ఈనెల 13న “గోదావరికి గర్భశోకం.. యథేచ్ఛగా ఇసుక రవాణా” శీర్షికన నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామ పరిధిలోని బ్రిక్స్ తయారీ షెడ్ల వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపులను తహసీల్దార్ నాగార్జున ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు.
గోదావరి నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తరలించి బ్రిక్స్ షెడ్ల ముందు నిల్వ చేసిన ఇసుకపై నవతెలంగాణలో వరుస కథనాలు వెలువడిన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది.తనిఖీలు నిర్వహించిన అధికారులు బ్రిక్స్ తయారీ షెడ్ల ముందు ఉన్న ఇసుక డంపులతో పాటు మరో షెడ్డు సమీపంలో భారీగా నిల్వ చేసిన వందల ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను గుర్తించి సీజ్ చేశారు.
స్థానికుల కథనం ప్రకారం గోదావరి నది నుంచి ప్రతిరోజూ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి షెడ్ల వద్ద డంప్ చేస్తుండగా,రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారంపై ఇప్పటికే నవతెలంగాణ దినపత్రికలో కథనాలు ప్రచురితమైనప్పటికీ మైనింగ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
-మైనింగ్ శాఖ మౌనం ఎందుకు..?
ఇసుక అక్రమ రవాణా,నిల్వల నియంత్రణలో కీలక బాధ్యత వహించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిల్వలు బహిరంగంగానే కనిపిస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం,రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన తరువాత కూడా స్పందించకపోవడంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
-బహిరంగ వేలం నిర్వహించాలి
ఇదిలా ఉండగా,సీజ్ చేసిన ఇసుక డంపులను బహిరంగ వేలం ద్వారా విక్రయించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.వందల ట్రాక్టర్ ట్రిప్పుల మేర ఉన్న ఇసుకను అక్కడే వదిలేస్తే మళ్లీ అక్రమ రవాణాకు అవకాశం ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందువల్ల సంబంధిత అధికారులు ఇసుక పరిమాణాన్ని అంచనా వేసి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించాలని కోరుతున్నారు.వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయడంతో పాటు,అక్రమంగా ఇసుకను తరలించిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-బాధ్యులపై చర్యలెప్పుడు..?
ఇసుక డంపులను సీజ్ చేయడం ప్రారంభ చర్య మాత్రమేనని,అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు,ఇంత భారీగా ఇసుక నిల్వ చేయడానికి సహకరించిన వారు ఎవరు అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి నది నుంచి అక్రమ ఇసుక తరలింపును పూర్తిగా అరికట్టేందుకు రెవెన్యూ,మైనింగ్,పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



