అంగన్వాడీ,పాఠశాల,హెల్త్ సబ్‌సెంటర్‌ల తనిఖీ.. చిన్నారుల ఆరోగ్యం,విద్యపై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం గోలన్‌కొండ గ్రామంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా పర్యటించి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, హెల్త్ సబ్‌సెంటర్‌ను పరిశీలించారు.గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్య, ప్రజారోగ్య సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
పర్యటనలో భాగంగా ముందుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, ఆర్‌బీఎస్‌కే (RBSK) కార్యక్రమం కింద చిన్నారులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు.పిల్లలకు ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారో,పరీక్షల్లో గుర్తించిన ఆరోగ్య సమస్యలకు ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలోని ప్రతి చిన్నారి ఎదుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు తల్లిదండ్రులు నెలనెలా పిల్లల ఎత్తు, బరువు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ పరీక్షల ద్వారా పిల్లల పోషకాహార స్థితి,శారీరక ఎదుగుదలపై స్పష్టమైన అవగాహన లభిస్తుందని తెలిపారు.చిన్నారుల తల్లులు కూడా క్రమం తప్పకుండా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.తల్లుల ఆరోగ్యం బాగుంటేనే పిల్లల ఆరోగ్యం,ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం నిర్మాణ దశలో నిలిచిపోయిన నూతన అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు. ఇంకా పూర్తి కావాల్సిన పనులను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకోని భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం గ్రామంలోని ప్రాధమిక మరియు జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో నిర్మాణం పూర్తయి ప్రారంభించని డైనింగ్ హాల్ ను ,నూతన తరగతి గదులను పరిశీలించి ప్రారంభించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకొని పెండింగ్ లో ఇంకనూ ఏమైనా పనులు ఉంటే త్వరతగతిన పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపడుతామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.గ్రామంలో బడి బాట కార్యక్రమం చేపట్టారా అని అడిగి తెలుసుకొని, ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను, బోధన, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత శాతం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చూడాలన్నారు.
అ తర్వాత గ్రామంలోని హెల్త్ సబ్‌సెంటర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వివరాలు,ఆశా కార్యకర్తల సంఖ్య, రోజువారీ ఓపీ వివరాలను రిజిస్టర్ల ద్వారా పరిశీలించారు. సబ్‌సెంటర్‌లో అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న పరీక్షలు, గ్రామంలో ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.గర్భిణీ స్త్రీలను క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తున్నారా, ప్రతి నెల వైద్య పరీక్షలకు హాజరవుతున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, వాటిలో సాధారణ ప్రసవాల శాతాన్ని తెలుసుకుని సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆశా కార్యకర్తలు, ఆయాలు గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. పర్యటనలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, సంబంధిత శాఖల అధికారులు,సిబ్బంది,గ్రామ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



