ఫైనల్లో జకోవిచ్‌

సెమీస్‌లో అల్కరాజ్‌పై విజయం
పారిస్‌ (ఫ్రాన్స్‌) : సెర్బియా స్టార్‌, మూడో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో స్పెయిన్‌ కుర్రాడు కార్లోస్‌ అల్కరాజ్‌పై 4-1తో గెలుపొందిన జకోవిచ్‌ కెరీర్‌ 34వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పోరుకు చేరుకున్నాడు. మూడున్నర గంటల పాటు సాగిన సెమీఫైనల్‌ సమరంలో 6-3, 5-7, 6-1, 6-1తో నొవాక్‌ జకోవిచ్‌ మెరుపు విజయం నమోదు చేశాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో వరుసగా 20వ విజయం నమోదు చేసిన జకోవిచ్‌.. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, కాస్పర్‌ రూడ్‌లలో ఒకరితో పోటీపడనున్నాడు.
టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ సెమీఫైనల్లో నిలువలేకపోయాడు. మూడో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌కు ఫైనల్‌ బెర్త్‌ అప్పగించక తప్పలేదు. సవాల్‌తో కూడిన సెమీస్‌లో ఫిజికల్‌ సామర్థ్యం పరంగా అల్కరాజ్‌ అలిసిపోయాడు. జకోవిచ్‌కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. తొలి సెట్‌ను 6-3తో గెల్చుకున్న జకోవిచ్‌.. రెండో సెట్‌ను 5-7తో చేజార్చుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస సెట్లను 6-1, 6-1 తేడాతో సొంతం చేసుకుని సత్తా చాటాడు. ఎనిమిది ఏస్‌లు, ఏడు బ్రేక్‌ పాయింట్లు సాధించిన జకోవిచ్‌.. పాయింట్ల పరంగా 128-100తో పైచేయి సాధించాడు. జకోవిచ్‌ 23 గేములు గెల్చుకోగా.. అల్కరాజ్‌ 12 గేములతో సరిపెట్టుకున్నాడు. జకోవిచ్‌ 39 విన్నర్లు కొట్టగా, అల్కరాజ్‌ 35 విన్నర్లు సంధించాడు. జకోవిచ్‌ 36 అనవసర తప్పిదాలతో సరిపెట్టగా.. అల్కరాజ్‌ ఏకంగా 50 అనవసర తప్పిదాలు చేశాడు.

Spread the love