పంట తరువాత మంట వద్దు.?

– పొలంలో కొయ్యలు,గడ్డి కాలుస్తున్న వైనం.
– భూసారం తగ్గి పంట దిగుబడిపై ప్రభావం.
–  అప్రమత్తంగా లేకుంటే తీవ్ర నష్టం.
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సాంప్రదాయం వ్యవసాయ పద్దతులపై అవగాహన లేకపోవడంతో ఏటా వ్యయం పెరుగుతోంది. ఎరువుల మోతాదు,మందుల పిచికారి ఇస్టారితిన వాడుతుండటంతో భూ సారం తగ్గి నష్టాలను కొనితెచ్చుకొంటున్నారు.రబీ పంట పూర్తి చేసుకొని ఖరీఫ్ పంట సాగుకు రైతులు సిద్దమవుతున్న సమయంలో కొంతమంది రైతులు పొలంలో మిగిలిపోయిన కొయ్యకాలు, గడ్డిని కాల్చేస్తున్నారు. దీంతో పోషకాలు నశించి, భూ సారం తగ్గుతుందని,ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపుతోందని మండల వ్యవసాయ అధికారి సుధాకర్ అన్నారు.
మంటతో భూసారానికి నష్టం..
నెలలో కార్బన్ తోపాటు మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. వరి కొత్త తరువాత పొలంలో కొయ్యకాలు, గడ్డిని నిప్పు పెట్టడంతో భూమిలో కార్బన్ శాతం తగ్గి మొక్కలకు సరిపడా పోషకాలు అందవు. ఈ పద్దతి ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్ళ తరువాత సాగు చేసే పంటలు తెగుళ్లకు తట్టుకోలేవని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. నేల పైభాగంలో ఉండే సూక్ష్మ క్రిములు,కీటకాలు పంటలకు మేలు చేస్తాయని,పొలంలో మంట పెడితే ఇవి చనిపోయి ఎనలేని నష్టం మిగులుస్తాయని అంటున్నారు.
వెస్ట్ డి కంపోజర్ తో ప్రయోజనం..
.రైతులు నాటు వేసేందుకు డీ కంపోజర్ ను నీటిలో కలిపి చల్లితే ప్రయోజనం ఉంటుంది. వరి గడ్డిని తగలబెట్టకుండా దుక్కి దున్నేటప్పుడు నీటితో పాటు డీ కంపోజర్ ను చల్లితే గడ్డి 20 రోజుల్లో కుళ్ళి పోతుంది. అనంతరం భూమి గల్లబారి నెలలో పోషకాలు విడుదల అవుతాయి. ఇలా విడుదల అయిన పోషకాలు పంటలకు తెగుళ్ల బారి నుంచి తట్టుకునే శక్తిని అందిస్తాయి. డి కంపోజర్ 5 బాటిళ్లు రూ.100 చొప్పున ఆర్డర్ పై పొందవచ్చు. ఇది రెండెకరాల భూమికి సరిపోతుంది.
ఇతరత్రా నష్టాలు..
పంట కాలం పూర్తియ్యాక రైతులు పొలంలో మిగిలిన వరి గడ్డి,పత్తి మొక్కలు, మిర్చి కట్టెలకు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం వేళ రైతులు పొలంలో మిగిలిన గడ్డి,  కొయ్యకాళ్ళను కుప్పగా వేసి  నిప్పు పెట్టి ఇంటికి వెళ్లిన సమయంలో మంటలు పెద్దవై సమీపంలో ఉన్న సెల్లకు వ్యాపించి ధాన్యపు రాసులు,గడ్డి వాములు తగలబడుతున్న సంఘటనలు నిత్యం చోటు చేసికుంటున్నాయి. ఇది కాక తీవ్రమైన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందువల్ల పంట చెలకు నిప్పుపెట్టవద్దని అధికారులు పేర్కొంటున్నారు.
Spread the love