గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయరా?

– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌
– సమ్మెను ఉధృతం చేయాలి : టీడీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి చింతక్రింది చక్రపాణి
నవతెలంగాణ-మంచాల
కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్స్‌ ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేస్తున్న ప్రభుత్వం, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులను ఎందుకు పర్మినెంట్‌ చేయడం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు చేస్తున్న సమ్మె సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12,679 గ్రామ పంచాయతీల్లో 50 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు 50, 60 ఎండ్ల నుంచి వివిధ కేటగిరీల్లో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని అన్నారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలేనని తెలిపారు. ఆరేండ్ల పాటు పదవీలో ఉండి పోయే ఎమ్మెల్యే, ఎంపీలకు లక్షల్లో వేతనాలు ఇచ్చి, పదవి దిగిన తరువాత పింఛన్లు తీసుకుంటున్నారనీ అన్నారు. కానీ ఏండ్ల తరబడి పని చేస్తున్నా, వారికి రూ.8500 వేతనం అమలు చేయడం ఏమిటని నిలదీశారు. మీరు పీఆర్సీలో నిర్ణయించిన మినిమమ్‌ బేసిక్‌ రూ.19 వేల వేతనం వీరికి ఎందుకు వర్తించదని నిలదీశారు. కనీసం జీఓ నెంబర్‌ ప్రకారం స్విపర్లకు రూ.15,600, పంప్‌ ఆపరేటర్లకు ఎలక్ట్రిట్రీషియన్‌, డ్రైవర్లు, కారో బార్‌, బిల్‌ కలెక్టర్‌కు రూ.19,500ల వేతనం ఇవ్వాలనీ కోరారు. ముఖ్యంగా కారోబార్‌, బిల్‌ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలనీ, డ్రైవర్లకు పంచాయతీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఖర్చులు భరించాలన్నారు. 51వ జీవోను రద్దు చేసి మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని కోరారు.
గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమ్మెకు టీడీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి చింతక్రింది చక్రపాణి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరిని వీడి గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు గ్యార పాండు, సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచామోనీ కృష్ణ, సంఘం మండలా ధ్యక్ష, కార్యదర్శిలు ఖాజాపాషా, దూసారి భాస్కర్‌, టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు వంగాల కృష్ణ, మైనార్టీ సెల్‌ పార్లమెంటు నాయకులు ఎండీ సలాం, తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు మంకు ఇందిరా, తెలుగు యువత మండల అద్యక్షులు బూరుగు ఐలేష్‌ యాదవ్‌, టీడీపీ నోముల గ్రామాధ్యక్షులు కసర మొనీ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love