మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయూ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లేష్‌,
– ఎంఈఓ వెంకట్‌రెడ్డికి సమ్మె నోటీసు

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీఐటీయూ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లేష్‌ అన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం 2009లో ఏర్పడిందన్నారు. ఈ పథకంలో పేద విద్యార్థులకు విద్యను అందించడం కోసం ఏర్పాటు చేశారన్నారు. 2009నుండి రూ.1000 వేతనం ఇస్తున్నారన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రూ.1000వేతనంతో కార్మికులు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. చాలీచాలని వేతనంతో ఇల్లు గడవడం లేదన్నారు. అప్పులు చేసి కార్మికులు వంట వండుతున్నారని చెప్పారు. వచ్చే బిల్లులు కూడా సరిగ్గా రావడం లేదని చెప్పారు. 6 నెలల కొకసారి వస్తున్నాయని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 2022 మార్చి బడ్జెట్‌ సమావేశల సందర్భంగా వేతనాలు రూ. 2000 పెంచుతున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఏరియల్స్‌తో సహా జీఓ నెంబర్‌ 8 ప్రకారం బిల్లులు చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వాలన్నారు. ఈ నెల 10,11,12 తేదీల్లో మూడు రోజులు స్కూల్లో వంట చేయడం నిలిపివేయనున్నట్టు చెప్పారు. సమ్మె చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐటీయూ మండల కన్వీనర్‌ బుగ్గరాములు, మంచాల మండల కన్వీనర్‌ పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజన కార్మికులు కొండ్రు పుష్పమ్మ, కొండ్రు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love