వివస్త్రను చేసి… మూత్రం పోసి…

Explain... Urinate...– అదనపు వడ్డీ కోసం దళిత మహిళపై దాడి
– బీహార్‌లో దారుణ ఘటన
పాట్నా : బీహార్‌లోని పాట్నా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక వడ్డీ వ్యాపారి, అతని సహచరులు రూ. 9,000 అప్పుపై రూ. 1,500 అదనపు వడ్డీ చెల్లించాలని డిమాండ్‌ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దళిత మహిళను వివస్త్రను చేసి ఆమెపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెపై మూత్ర విసర్జన చేశారు. ఈ దారుణ ఘటన పాట్నాలోని మోసింపూర్‌ గ్రామంలో చోటు చేసుకున్నది. బాధితురాలు ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నది. తాను తీసుకున్న రుణం మొత్తాన్ని, నిర్ణీత వడ్డీని ప్రధాన నిందితుడు ప్రమోద్‌ సింగ్‌కు తిరిగి ఇచ్చానని చెప్పారు. అయితే, అతను మరింత డబ్బును డిమాండ్‌ చేశాడనీ, మేము డిమాండ్‌ను తిరస్కరించామని వెల్లడించారు. తనకు ఎక్కువ డబ్బు ఇవ్వకుంటే గ్రామంలో వివస్త్రను చేసి ఊరేగిస్తానని వడ్డీ వ్యాపారి ప్రమోద్‌ సింగ్‌ ఫోన్‌లో బెదిరించడంతో బాధితురాలు బెదిరిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ”ఒక పోలీసు బృందం ఫిర్యాదు గురించి విచారించడానికి శనివారం గ్రామాన్ని సందర్శించింది. ఇది ప్రమోద్‌, అతని సహచరులకు కోపం తెప్పించింది” అని కుటుంబ సభ్యుడు చెప్పారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా ప్రమోద్‌ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బట్టలు విప్పి, కర్రలతో కొట్టారు. ప్రమోద్‌ అతని కుమారుడిని నా ముఖంపై మూత్ర విసర్జన చేయమని అడిగాడని ఫిర్యాదుదారు తెలిపారు. ”అతను అలా చేశాడు. ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకుని ఇంటికి తిరిగొచ్చాను. నిందితులు ఆధిపత్య కులానికి చెందిన వారు. గ్రామంలో దళితులకు చెందిన కొన్ని ఇండ్లు మాత్రమే ఉన్నాయి” అని వెల్లడించారు.
దాడి అనంతరం ప్రమోద్‌ సింగ్‌, అతని కుమారుడు అన్షు సింగ్‌ పరారీలో ఉన్నారని పాట్నా సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రాజీవ్‌ మిశ్రా తెలిపారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ”మేము ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. సోదాలు నిర్వహిస్తున్నాము” అని మిశ్రా తెలిపారు.

Spread the love