వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలి

– జిల్లా కలెక్టర్‌ విపి గౌతమ్‌ ఆదేశం
నవతెలంగాణ- నేలకొండపల్లి
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ బిపి గౌతమ్‌ ఆదేశించారు. శుక్రవారం మండల పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. శుక్రవారం కలెక్టర్‌, నేలకొండపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపి లను పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన శివ పరీక్షలు గదిని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచాలని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ లో సౌకర్యాల కల్పనతో పాటు, స్పెషాలిటీ వైద్యుల కేటాయింపు చేసినట్లు తెలిపారు. గైనిక్‌, అనేస్తేషియా, చైల్డ్‌ ప్రత్యేక వైద్యులు ఉన్నట్లు ఆయన అన్నారు. ఆసుపత్రిలో 24గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రజల్లో అవగాహన కల్పించాలని, బోర్డులు ప్రదర్శించాలని తెలిపారు. వైద్యుల పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్నారు. నైట్‌ డ్యూటీ చార్ట్‌ పేర్లు, ఫోన్‌ నెంబర్లతో సహా ప్రదర్శించాలన్నారు. గర్భిణీలకు కాన్పులను ఆసుపత్రిలోనే చేయాలని ఖమ్మం ఆసుపత్రికి పంపించవద్దన్నారు ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు జరుగుతున్నట్లు, నెల రోజుల్లో ఆపరేషన్లు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తుందని, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించుటకు అన్ని చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. కలెక్టర్‌ తనిఖీ సందర్భంగా వైద్యాధికారులు డా. మంగళ, డా.రాజశేఖర్‌, డా.రాజేష్‌, డా.శ్రావణ్‌, నేలకొండపల్లి ఎంపిడివో జమలరెడ్డి, తహసీల్దార్‌ అనురాధబాయి, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌, మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. రెగ్యులర్‌గా కళాశాలకు వస్తున్నది, తరగతులు జరుగుతున్న తీరు, లెక్చరర్లు అన్ని సబ్జెక్ట్‌లకు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు ఇచ్చారా, పరీక్షలకు సన్నద్ధం అయ్యారా, ఐఐటి, జెఇఇ బుక్స్‌ ఇస్తున్నారా, ఇంటర్‌ తదుపరి ఏ కోర్స్‌ చేయదలచింది, ఏ కళాశాలలో చేరదలచింది అడిగి తెలుసుకున్నారు. ముందే భవిష్యత్‌ లక్ష్యంపై పూర్తి అవగాహనకు రావాలన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. అనంతరం కళాశాల అధ్యాపకులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్‌, ఎంసెట్‌ ఓరియెంట్‌ గా తరగతుల నిర్వహణ ఉండాలన్నారు. లైబ్రరీలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులతో నీట్‌, ఎంసెట్‌కి అప్లై చేయించాలన్నారు. ఇంటర్‌ కెరీర్‌ ఎంపికకు వారధి అని, విద్యార్థులకు భవిష్యత్‌ కెరీర్‌పై అవగాహన కల్పించాలన్నారు. డ్రాప్‌ అవుట్‌లు లేకుండా చూడాలన్నారు. సౌకర్యాల పరంగా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. అధ్యాపకులు తమ స్వంత పిల్లలపై ఎలాగైతే శ్రద్ధ తీసుకుంటారో, అలాగే కళాశాల పిల్లలపై శ్రద్ధ పెట్టాలని, వారి భవిష్యత్‌ తీర్చిదిద్దాలని కలెక్టర్‌ అన్నారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు. పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ తనిఖీ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ.పరంజ్యోతి, జూనియర్‌ కళాశాల ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణరెడ్డి, విద్యాశాఖ ఇఇ నాగశేషు, నేలకొండపల్లి ఎంపిడివో జమలారెడ్డి, తహసీల్దార్‌ అనురాధబాయి, అధికారులు తదితరులు ఉన్నారు.

Spread the love