– మెరుగైన చికిత్సతో నయం చేయోచ్చు
– నేరుగా ప్రజల వద్దకే వైద్య సేవలు
– ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి ప్రాణాలు కాపాడుకోవాలి
– బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ కల్పన రఘునాథన్
– బీరంగూడ క్యాన్సర్ వైద్య శిబిరానికి విశేష స్పంద
నవతెలంగాణ – అమీన్‌పూర్ : ప్రజలు హాస్పిటల్ వరకు రావాల్సిన అవసరం లేకుండా, బాధితుల వద్దకే నేరుగా వెళ్లి అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ కల్పన రఘునాథన్ తెలిపారు.మేడే వారోత్సవాల ముగింపు సందర్భంగా బీరంగూడలోని భ్రమరాంబికా నగర్ కాలనీలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఈఎస్ఐ, శ్రీ వేద ఆస్పత్రి సంయుక్త సౌజన్యంతో జరిగిన ఈ శిబిరానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సందర్భంగా బసవతారకం హాస్పిటల్ అసోసియేట్ డైరెక్టర్ కల్పన రఘునాథన్ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం మరియు పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలే క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాలన్నారు.

కలుషిత ఆహార పదార్థాలు, పని ప్రదేశాల్లోని పరిస్థితులపై తమ సంస్థ నిరంతరం రీసెర్చ్ చేస్తోందని వెల్లడించారు. సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవీనా మాట్లాడుతూ.. ప్రధానంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ల పట్ల వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. “క్యాన్సర్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు” అని ఆమె సూచించారు. బసవతారక హాస్పిటల్ ప్రత్యేక వాహనం నేరుగా మీ ప్రాంతానికే వస్తుందని, ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. శిబిరంలో మొత్తం 228 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా, వారిలో 100 మంది పురుషులు, 128 మంది మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈఎస్ఐ అధికారుల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్మికులు, మహిళలు, సామాన్య ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరంలో వందలాది మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, తగు జాగ్రత్తలు సూచించారు.



