పరీక్షలంటే భయపడొద్దు

– ధైర్యంగా పరీక్షలు రాయాలి :విద్యార్థులకు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పరీక్షలంటే భయపడవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దైర్యంగా వాటిని రాయాలని ఒక ప్రకటనలో ఆయన సూచించారు. ప్రశ్నాపత్రం చూడగానే భయపడకూడదనీ, సహచర విద్యార్థులతో పోల్చుకోవద్దని తెలిపారు. అల్పాహారం తీసుకున్న తర్వాతనే చదవాలనీ, పాఠాలను బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవాలని సూచించారు. చదువుకునేటప్పుడు సెల్‌ఫోన్లు, టీవీలు స్విచ్‌ ఆఫ్‌ చేయాలని పేర్కొన్నారు. పరీక్షకు కావాల్సిన పెన్నులు, ప్యాడ్‌, పెన్సిల్‌, రబ్బర్‌ ముందురోజు సిద్ధం చేసుకోవాలని కోరారు. వేసవి కాలం దృష్ట్యా అందరూ ఉదయం పూటనే టిఫిన్‌ తిని, వాటర్‌ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచీలను తీసుకెళ్లకూడదనీ, ఓఎంఆర్‌ షీట్‌ను, ప్రశ్నాపత్రాలను ముందుగానే సరిచూసుకున్న తర్వాత హాల్‌ టికెట్‌ నంబరు రాసి ఆ తర్వాత పరీక్ష రాయడం మొదలు పెట్టాలని పేర్కొన్నారు. ఇంటర్‌ పరీక్షల నేపథ్యంలో మంత్రి విద్యార్థులకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు.

Spread the love