హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

Drug gang arrested in Hyderabad– నిందితుల్లో ముగ్గురు నైజీరియన్లు, వినియోగదారులు, సినీ నిర్మాత
– బేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ సీరియస్‌
– సినిమా టీంకు నోటీసులిస్తాం.
– ఇక నుంచి ప్రతి సినిమాపై నిఘా
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న.. కొనుగోలు చేసిన ఎనిమిది మందిని గురువారం నార్కోటిక్‌ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు నైజీరియన్లు, మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న ఐదుగురు, ఓ సినీ నిర్మాత ఉన్నారు. వీరి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్‌, 24 ఎక్టసీ పీల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వివరాలు వెల్లడించారు.
గత నెల 11న నార్కోటిక్‌ విభాగం పోలీసులు గుడిమల్కాపూర్‌, మాదాపూర్లో దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో బాలాజీ, సినీ ఫైనాన్షియర్‌ వెంకట రత్నారెడ్డి, మురళిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితులిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ నార్కోటిక్‌ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. నైజీరియాకు చెందిన అమోబి చుక్వుడి మూనాగోలు, ఇగ్బ్రావ్‌ మిచెల్‌, థామస్‌ అనఘాకాలు బిజినెస్‌ వీసా, మెడికల్‌ వీసాపై ఇండియాకు వచ్చారు. 2015లో ఒకరు, 2020 మరొకరు, 2022లో ఇంకొక్కరు ఇండియా వచ్చి ఢిల్లీ, బెంగళూర్‌లో మకాం వేశారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నైజీరియా దేశానికి చెందిన వారి నుంచి డ్రగ్స్‌ కోనుగోలు చేస్తూ మన దేశవ్యాప్తంగా వారి కమ్యూనిటీ మెంబర్స్‌కు, విద్యార్థులకు (నైజీరియన్లకు) ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ విక్రయించడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌పై దృష్టి సారించిన నిందితులు నగరంలోని యువకులను, విద్యార్థులను ఎంచుకుని డ్రగ్స్‌ కొకైన్‌, ఎండీఎంఏ తదితర డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో నగరానికి చెందిన దేవరకొండ సురేష్‌రావు, కొల్లి రాంచంద్‌, కూరపాటి సందీప్‌, పగళ్ల శ్రీకర్‌ కృష్ణప్రణీత్‌తోపాటు (డైరెక్టర్‌) అనుగు సుశాంత్‌ రెడ్డికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. దీన్ని గుర్తించిన పోలీసులు 8 మందిని ఆరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్‌ ఎస్పీ డీ.సునితారెడ్డి, డీఎస్‌పీ నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ పీ.రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.
బేబీ సినిమాపై సీరియస్‌
ఇటీవల విడుదలైన బేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సీరియస్‌ అయ్యారు. డ్రగ్స్‌ కల్చర్‌ ప్రోత్సహించేలా సన్నివేశాలతో సినిమా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సినిమాను చూసిన నిందితులు అలా పార్టీ చేసుకున్నారని చెప్పారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు ‘హెచ్చరిక కింద వేసే ప్రకటన’ కూడా వెయ్యకుండా డైరెక్ట్‌గా ప్లే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇక నుంచి ప్రతి సినిమాపై నిఘా వేస్తామన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని సీపీ హెచ్చరించారు.

Spread the love