– ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు
– ఈసాల తక్కళ్లపల్లిలో 44.7 డిగ్రీల ఎండ
– దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
– జనగామ జిల్లా రఘునాథపల్లిలో 3.98 సెంటీమీటర్ల వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితి అలాగే కొనసాగుతున్నది. పొద్దంతా భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. రాత్రి పూట వరుణుడు వర్షాన్ని ఝులిపిస్తున్నాడు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మళ్లీ ఎండ తీవ్రత పెరుగుతున్నది. కిందటి రోజుతో పోల్చితే ఒక డిగ్రీ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో అత్యధికంగా 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఐదు రోజులకు సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు(గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) వర్షం పడే సూచనలున్నట్టు తెలిపింది. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై స్పల్ప ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశాలున్నాయి.
65 ప్రాంతాల్లో వర్షం
రాష్ట్రంలో మంగళవారం రాత్రి 10 గంటల వరకు 65 ప్రాంతాల్లో వర్షం పడింది. పది చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా రఘునాథపల్లిలో అత్యధికంగా 3.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. నల్లగొండ జిల్లా చండూరు మండలంలో పలు చోట్ల వడగండ్ల వాన పడింది.