•మండల స్పెషల్ ఆఫీసర్ బి.వేణుగోపాల్
నవతెలంగాణ – మర్రిగూడ
భూగర్భ జలాల పెరుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ భీమనపల్లి వేణుగోపాల్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచులకు,గ్రామస్థాయి అధికారులకు,సిబ్బందికి,వి బి జి రామ్ జి పథకం కింద చేపట్టబోయే “జలసిరి” కార్యక్రమం పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.గ్రామాలలో నీటి సాంద్రతను పెంచేందుకు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత,ప్రతి పొలానికి పంట కుంట,ప్రతి ఊరికి ఊట కుంట అనే నినాదంతో పనిచేయాలని సూచించారు.
మునుగోడు ప్రాంతంలో ఫ్లోరిన్ అధికంగా ఉన్నదని,భూమి లోతుకు వెళ్లే కొలది ఫ్లోరిన్ అధికంగా ఉంటుందని,ఇక భూమి లోతుకు బోర్లు వేయటం వలన ఆ వాటర్ లో ఫ్లోరిన్ అధికంగా కలిసి ఆ నీటితో పండించే పంటలో అధిక శాతం ఫ్లోరిన్ ఉంటుందని వివరించారు.కేవలం మిషన్ భగీరథ వాటర్ ద్వారా ఫ్లోరిన్ తగ్గుముఖం పట్టదని,పంటలకు ఉపయోగపడే సాగునీటిలో కూడా ఫ్లోరింగ్ లేకుండా చూసుకోవాలని అందుకు ప్రత్యామ్నాయంగా వర్షపు నీటిని వృధా చేయకుండా భూగర్భజలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలను,పంట కుంటలను,ఊట కుంటలను ఏర్పాటు చేసుకొని ఫ్లోరిన్ మహమ్మారిని తరిమికొట్టాలన్నారు.
అంతకుముందు ఏపీవో జయరాజు ప్రభుత్వం వి బి జి రామ్ జి పథకం కింద చేపట్టబోయే “జలసిరి” కార్యక్రమం,పనుల గురించి క్షుణ్ణంగా వివరించారు.కార్యక్రమంలో ఎంపీడీవో జిసి మున్నయ్య,ఎంపీఓ రవికుమార్,ఏపీఎం అద్దంకి వెంకట్,ఏఈ గ్రిడ్ వెంకటేష్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రభాకర్,ఆయా గ్రామాల సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,ఉపాధిహామీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.



