వయో వృద్ధులు హోమ్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించుకోవాలి

– పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాల ఏర్పాటు
– జిల్లా కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
లోక సభ ఎన్నికలలో 85 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు ఉన్న వయో వృద్ధులందరూ హోమ్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించుకోవాలని, తక్కిన వారు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు.గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా  వయో వృద్ధుల ఓటు హక్కు వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  గత  అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల సంఘం 80 సంవత్సరాలు నిండిన వారికి హోం ఓటింగ్ సౌకర్యం కల్పించిందని, లోక్ సభ ఎన్నికలలో దానిని 85 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపారు.  85 సంవత్సరాలు పైబడిన ఓటర్లందరు హోం వోటింగ్ సౌకర్యం వినియోగించుకోవాలని, తక్కిన వయవృద్ధులందరూ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని అన్నారు. ఇందుకుగాను పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రత్యేకించి సహాయకులతో పాటు, వీల్ చైర్ ,  వైద్య సహాయం అవసరమైతే అందజేస్తామని స్పష్టం చేశారు. వృద్దుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉండేందుకు గదులతో పాటు, టెంట్, ప్రాథమిక చికిత్స, అవసరమైన మందుల వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తామని, అందువల్ల  ఓటు హక్కు కలిగిన వయవృద్ధులైన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్లుగానే లోక సభ ఎన్నికలలో సైతం ఓటు వేయాలని ఆమె  పునరుద్ఘాటించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచందర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, జడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి డి.సక్కుబాయి, వయోవృద్ధుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సముద్రాల మల్లికార్జున, కార్యదర్శి గొర్రె సుదర్శన్ రెడ్డి,  మునగాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love