అమల్లోకి ఎన్నికల కోడ్‌

– అభ్యర్థులు, ఓటర్లకు కీలక సూచనలు
– అధికారిక వెబ్‌సైట్ల నుంచి నేతల ఫోటోల తొలగింపు
– ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబరు 1950
– వృద్ధులు, వికలాంగులకు రవాణా సౌకర్యం
– ఓటర్‌కార్డుతోపాటు 12 రకాల ధృవపత్రాలకు ఓకే
– బ్యాలెట్‌ పత్రాలపై గుర్తులతోపాటు అభ్యర్థుల ఫొటోలు
– 31 వరకు ఓటు నమోదుకు అవకాశం : రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్‌
నవతెలంగాణ ; ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సోమవారం రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌, రాష్ట్ర పోలీస్‌ నోడల్‌ అధికారి సంజరుకుమార్‌ జైన్‌, డిప్యూటీ సీఈవో సత్యవాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై కీలక విషయాలను ఆయన ప్రకటించారు. నవంబరు 30న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వచ్చిందని తెలిపారు. పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా నిబంధనావళిని పాటించాలని ఆదేశించారు. లేకపోతే మార్గదర్శకాల ప్రకారం కఠినంగా వ్యహరించాల్సి వస్తుందని హెచ్ఛరించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్‌ స్పీకర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ నేతల ఫొటోలను తొలగించాలని ఆదేశించారు. మహిళలు, యువత కోసం ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బెయిలీ బ్యాలెట్‌ పత్రాలను అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలతో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.
ప్రజలు ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 12 కార్డులను వినియోగించుకోవచ్చని సూచించారు. ఇక అభ్యర్థులు తమ అఫిడవిట్‌లో అన్ని కాలమ్‌లను కచ్చితంగా నింపాలనీ, లేదంటే నామినేషన్‌ ఫారం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయాలంటే 1950 నంబరులో సంప్రదించాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ పత్రాలపై గుర్తులతోపాటు అభ్యర్థుల ఫొటోలను సైతం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 31 వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఓటర్ల జాబితాలో చిరునామా మార్పునకు సంబంధించిన దరఖాస్తులను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై పూర్తి పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. నగదును తీసుకువెళ్లే సమయంలో పత్రాలు, వివరాలు ఉండాల్సిందేనన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల గుర్తింపుపై కసరత్తు జరుగుతున్నదన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా భయం లేకుండా వినియోగించుకోవాలని సూచించారు.
119 స్థానాలు..3.17 కోట్ల ఓటర్లు
రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024, జనవరి 16తో ముగియనుంది. మొత్తం 119 స్థానాలకుగాను ఎస్సీ 19, ఎస్టీ 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 3.17 కోట్ల ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1.58 కోట్లు కాగా, మహిళలు సైతం అదే స్థాయిలో 1.58 కోట్ల మంది ఉండటం గమనార్హం. కాగా 2557 మంది ట్రాన్స్‌జెండర్లు నమోదు చేసుకున్నారు. సర్వీసు ఓటర్లు 15,338 వరకు ఉన్నారు. ఓటర్ల నిష్పత్తి 998గా ఉంది. 3.15 లక్షల మంది 18 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న వారు కావడం విశేషం.
35,356 పోలింగ్‌ స్టేషన్లు
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు 35,356 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అర్భన్‌లో14,464 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 20,892 ఏర్పాటయ్యాయి. నగటున ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు 897 మంది ఓటర్లు ఉన్నారు. 644 మోడల్‌ పీఎస్‌లనూ ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వృద్ధుల వెంట ఒక వ్యక్తి ఓటేయడానికి రావచ్చు. అలాగే వికలాంగులకూ అవకాశం కల్పించారు.
ఈవీఎంలు..
రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించేవి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు). వీటి అవసరం ఎంతో ఉంది, బ్యాలెట్‌ యూనిట్లు 55,826 అవసరం కాగా, 72,933 ఉన్నాయి. సీయూలు 43,614కుగాను 57,691 , వీటీలు 47,103కుగాను, 56745 అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెప్పారు.

Spread the love