ఎన్నికలొస్తే చాలు…

Elections are enough...– మతరాజకీయం జోడించేలా ప్రచారాలు
– కార్యక్రమమేదైనా సోషల్‌ మీడియాలోకి రావాల్సిందే
– మోడీ రాజకీయ వ్యూహంపైనే చర్చ
కార్యక్రమం.. సందర్భం.. అది ఏదైనా.. దానిని రాజకీయ ప్రచారాస్త్రంగా మలుచుకోవటంలో ప్రధాని మోడీ ముందుంటున్నారు. కాశ్మీర్‌లో పర్యటన చేసినా..
కన్యాకుమారిలో కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆయన చేసే ప్రతీదీ రాజకీయంగానే ఉంటుందనే వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. నిత్యం వార్తల్లోనే ఉంటారనీ, సామాజిక, రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా ఉంటారని విశ్వవ్యాప్తంగా అంగీకరించబడింది. ప్రజల దృష్టిని ఆకర్శించటానికి ఆయన అధిక శ్రద్ధ కనబరుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు ఆయన మతపరమైన విషయాలతోనూ బిజీగా ఉంటూ.. వాటిని సైతం ప్రచారంగా మలచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు.

న్యూఢిల్లీ : ముఖ్యంగా, ఇటీవల ఆయన పర్యటనలను చూస్తే ఏ రాష్ట్రానికి వెళ్లినా.. మరే ఇతర ప్రాంతంలో పర్యటించినా.. అక్కడ ఉండే ప్రతిష్టాత్మక ఆలయాలు, ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అక్కడ పూజల్లో, ఇతర సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల దృష్టిని తన వైపు మల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అక్టోబరు 12న ఉత్తరాఖండ్‌లోని పార్వతి కుండలో దర్శనం చేశారు మోడీ. దీనికి సంబంధించి పలు సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌, ప్రధానమంత్రి అధికారిక సైట్‌లలో ప్రచురించబడిన వీడియోలు, చిత్రాలు ప్రజల దృష్టిని ఆకర్షించింది. మహాత్మా గాంధీ జయంతికి ఒక రోజు ముందు స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ను ప్రచారం చేయడానికి మోడీ చీపురును ఉపయోగించిన ఫోటోలు మరవకముందే పై చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కాయి.
ఇక ఇలాంటి చిత్రాలకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విట్టర్‌) వంటి సామాజిక మాధ్యమాల్లో బీజేపీ, దాను అనుబంధ సంఘాలు విపరీతమైన ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. మోడీని ఆకాశానికి ఎత్తుతున్నాయి. బాలీవుడ్‌ చిత్రాలకు సంబంధించిన పాటలతో ఎక్కువ మొత్తంలో లైక్‌లు, వీక్షణలు వచ్చే విధంగా ఐటీ సెల్‌ ప్రభావవంతంగా పని చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో మోడీ వేషధారణ సైతం ప్రజల దృష్టిని ఆకర్షించేదిగా ఉన్నదని తెలిపారు. పెరిగిన గడ్డంతో ఆయనను ఒక దూరదృష్టి పాలకుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు సామాజిక మాధ్యమాల్లోని బీజేపీ ఐటీ సెల్‌ చేసిందని అన్నారు. కరోనా మహమ్మారి విషయంలో మోడీ కష్టపడుతున్న తీరు గర్వించదగినదంటూ ప్రచారాలు చేసుకున్నాయి.
2019 మేలో కేదార్‌నాథ్‌ ఆలయ సముదాయంలోని గుహలో ఉన్నట్టుగా కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బీజేపీ తన ఆయుధమైన హిందూత్వకు మోడీ ఈ పర్యటనతో మరింత ప్రచారం కల్పించేలా చేశాయి. మోడీ రాజకీయాలలో స్వీయ ప్రదర్శన ఎక్కువగా ప్రధానమైందనీ, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయనకు ప్రచారం మీద ఉన్నంత ధ్యాస ప్రజా సంక్షేమంపై ఉండదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం చేయని ప్రధాని.. తనకు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై దృష్టి పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడని అంటున్నారు.

Spread the love