టెట్‌పై టీచర్లలో గందరగోళాన్ని తొలగించండి

టెట్‌పై టీచర్లలో గందరగోళాన్ని తొలగించండి– విద్యాశాఖ అదనపు సంచాలకులకు ఉపాధ్యాయ సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) విషయంపై ఉపాధ్యాయులకు స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను శనివారం హైదరాబాద్‌లో యూఎస్‌పీసీ, జాక్టో, పీఆర్టీయూటీఎస్‌, ఆర్‌యూపీపీటీఎస్‌ సంఘాల నాయకులు కలిసి వినతిపత్రాలను సమర్పించారు. పలు అంశాలపై చర్చించారు. ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయుల సందేహాలపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కె జంగయ్య, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్‌), పి నాగిరెడ్డి (టీపీటీఎఫ్‌), టి లింగారెడ్డి (డీటీఎఫ్‌), జి సదానందంగౌడ్‌, ఇఫ్తేకార్‌ అహ్మద్‌ (ఎస్టీయూటీఎస్‌), బి కమలాకర్‌రావు (పీఆర్టీయూటీఎస్‌), జి జగదీష్‌, లింగం, అజ్మతుల్లా (ఆర్‌యూపీపీటీఎస్‌) తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల సందేహాలను నివృత్తి చేయాలి : యూఎస్‌పీసీ
టెట్‌కు సంబంధించి ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయుల సందేహాలను విద్యాశాఖ అధికారులు నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్యను శనివారం హైదరాబాద్‌లో యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, పి నాగిరెడ్డి, టి లింగారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. 2010, ఆగస్టు 23కి ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత మినహాయించబడిందని తెలిపారు. కానీ ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఆ నిబంధనను తొలగించారని పేర్కొన్నారు. కానీ ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు ఎవరు, ఏ పేపర్‌ రాయాలో పేర్కొనలేదని వివరించారు. ఇది ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నదని తెలిపారు. 2010, ఆగస్టు 23కి ముందే నియామకమైన ఉపాధ్యాయులు టెట్‌ అర్హత నుంచి మినహాయించబడ్డారంటూ పదేండ్లుగా ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. టెట్‌ రాసేందుకు గరిష్ట వయోపరిమితి 44 ఏండ్లుగా నిర్ణయించారని పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు పలువురు ఉపాధ్యాయులు టెట్‌ రాసే ఆలోచన చేయలేదని తెలిపారు. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు 45 ఏండ్లకు పైబడి, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నారని వివరించారు. దీర్ఘకాలంగా ఒకే సబ్జెక్టు బోధనకు పరిమితమైన ఉపాధ్యాయులు సాధారణ టెట్‌ కోసం నిర్ణయించిన అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో పరీక్ష రాయడం ఈ వయసులో ఇబ్బందికరమని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతికి టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహించాలని కోరారు. విద్యారంగంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితిని ఎన్‌సీటీఈకి వివరించి ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు లేదా ప్రత్యేక టెట్‌ నిర్వహణకు వీలైనంత త్వరగా అనుమతి తీసుకోవాలని సూచించారు.

Spread the love