ఎల్లుండి బక్రీద్ పాకిస్థాన్ లో కొత్త ట్రెండ్.. జీవాల దోపిడీ

నవతెలంగాణ – పాకిస్థాన్: ఈ నెల 29న బక్రీద్ కాగా, ప్రస్తుతం పాకిస్థాన్ లో మేకలు, గొర్రెల వంటి జీవాలకు రక్షణ లేకుండా పోయింది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయం. అయితే మేకలు, గొర్రెల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అనదగ్గ కరాచీలో మేకలు, గొర్రెలు, పశువులు దొంగతానికి గురయ్యాయన్న కేసులు గత కొన్నిరోజుల్లో ఎన్నో నమోదయ్యాయట. ఇతర ప్రాంతాల్లో జీవాలను అమ్మేందుకు వెళుతున్న వారిని బెదిరించి, జీవాలను అపహరిస్తున్నారంటే పాక్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను ఎత్తుకెళ్లారు.పాకిస్థాన్ లో సాధారణ దొంగతనాలే అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయనుకుంటే, ఇప్పుడు బక్రీద్ సీజన్ లో మేకలు, గొర్రెలను చోరీ చేస్తున్న ఘటనలు అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయట. దాంతో కరాచీ నగరంలో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు షాహీన్స్ పేరిట ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేస్తున్నారు.

Spread the love