ఆర్టీసీ ఎండీకి హైకోర్టు షోకాజ్‌ నోటీసు

నవతెలంగాణ – హైదరాబాద్‌: సహకార పరపతి సంఘాని (సీసీఎస్‌)కి నిధుల చెల్లింపుపై తాము ఆదేశించినా ఆ మేరకు ఎందుకు చెల్లింపులు చేయలేదో చెప్పాలని ఆర్టీసీ ఎండీకి, చీఫ్‌ మేనేజర్‌ (ఎఫ్‌అండ్‌ఏ)కు హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఒకవేళ ఎవరూ హాజరుగాని పక్షంలో ఎక్స్‌పార్టీగా పేర్కొంటామని చెప్పింది. సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా, మే 15వ తేదీలోగా రూ.50 కోట్లు, మరో రూ.100 కోట్లను నవంబర్‌ 25లోగా సీసీఎస్‌కు డిపాజిట్‌ చేయాలని ఏప్రిల్‌లో హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలిచి్చనా ఆర్టీసీ యాజమాన్యం పాటించడం లేదని, కావాలనే ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ ఉద్యోగులు జూన్‌లో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆర్టీసీ ఎండీ, చీఫ్‌ మేనేజర్‌ను పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ పి.మాధవీ దేవి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎండీ, చీఫ్‌ మేనేజర్‌ హాజరుకావాలంటూ ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Spread the love