ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి

ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి– సీపీఎస్‌ను రద్దు చేయాలి
– పెండింగ్‌ డీఏలను ప్రకటించాలి : తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలను చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని కోరింది. పెండింగ్‌లో నాలుగు డీఏలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యోగుల చందాతో కూడిన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పదోన్నతులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. 2018 నుంచి ఉద్యోగుల బదిలీలు జరగలేదని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన బదిలీలను వెనక్కి పంపిన తర్వాతే ఉద్యోగుల బదిలీలను చేపట్టాలని కోరారు. గచ్చిబౌలి టీఎన్జీవో రెండో ఫేజ్‌లో 101.02 ఎకరాల స్థలాన్ని సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. భాగ్యనగర్‌ టీఎన్జీవో హౌజింగ్‌ సొసైటీ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో సర్వేనెంబర్‌ 36,37 గోపనపల్లి ఇండ్ల స్థలాలను బిటి ఎన్జీవోకు కేటాయించడానికి ప్రభుత్వం 2014, జులై రెండోన జారీ చేసిన మెమోను రద్దు చేసి కేటాయించాలని సూచించారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచేటట్టు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయంలోకి హెచ్‌వోడీల నుంచి 12.5 శాతం కోట అమలు చేసి ఉద్యోగులను పంపాలని సూచించారు. 317 జీవోలోని లోపాలను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 భవిష్యత్తు ఉద్యోగ నియామకాలకు వర్తింపచేసేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాత ఉద్యోగులకు పాత సీనియార్టీని కొనసాగించాలని అన్నారు. మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన క్యాడర్‌ స్ట్రెంథ్‌ను పాత జిల్లాల్లో ఉన్న విధంగా అదనపు క్యాడర్‌ను మంజూరు చేయాలని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ అనుమతిని 2026, మార్చి 31 వరకు పొడిగించాలని కోరారు. రిటైర్డ్‌ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దనీ, తద్వారా పదోన్నతులు రాక ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఉద్యోగుల మీద కక్షసాధింపు చేస్తూ అక్రమ ఆస్తుల పేరుతో కేసులను నమోదు చేయడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో, టీజీవో ప్రధాన కార్యదర్శులు ముజీబ్‌, ఎ సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, ట్రెసా అధ్యక్షులు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె గౌతంకుమార్‌, తెలంగాణ ఇంటర్‌ విద్యాజేఏసీ చైర్మెన్‌ పి మధుసూదన్‌రెడ్డి, క్లాస్‌-4 ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె గంగాధర్‌, గ్రూప్‌-1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love