వియత్నాం మీడియాకు జర్నలిజం, ప్రజా సంబంధాలపై శిక్షణ ముగింపు

నవతెలంగాణ-హైదరాబాద్‌
వియత్నాం మీడియా నిపుణుల కోసం జర్నలిజం, ప్రజా సంబంధాలపై రెండు వారాల శిక్షణా కార్యక్రమం ముగిసింది. జర్నలిస్టులు శుక్ర, శనివారాలో ఆదివారం వియత్నాంకు బయలుదేరుతారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఐటీఈసీ ప్రోగ్రాం కింద భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివద్ధి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డా. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శశాంక్‌ గోయెల్‌ మాట్లాడుతూ వేగవంతమైన సాంకేతిక పురోగతి, అభివద్ధి చెందుతున్న కమ్యూనికేషన్‌ యుగంలో మీడియా నిపుణులు సత్యాన్ని అనుసరించాలని అన్నారు. కచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో, తద్వారా ప్రజాస్వామ్య పునాదులు, ప్రపంచ అవగాహనను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మీడియా నిపుణులు తమ కెరీర్లో ఆయా దశలలో శిక్షణా కార్యక్రమాలకు హాజరవడం ద్వారా వారి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తాజాపరుచుకోవాలని సూచించారు. భారతదేశంలో వైవిధ్యమైన క్రియాశీలక ప్రింట్‌ మీడియా వ్యవస్థలో భారీ సాంకేతిక పురోగతి సాధించిన డిజిటల్‌ మీడియా, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (గతంలో ట్విటర్‌), ఇన్‌స్టాగ్రామ్‌ యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.. ఈ కార్యక్రమం వియత్నాంలోని మీడియా నిపుణులను తమ దేశంలోని మీడియా పరిశ్రమకు అర్ధవంతమైన సహకారం అందించడానికి ఉపయోగపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

Spread the love