రూపుమాసిపోతున్న ‘వేట’ జాతులు’

రూపుమాసిపోతున్న 'వేట' జాతులు'రాయలసీమలో శికారిలుగా చెప్పబడే వారిని మహారాష్ట్ర, తెలంగాణలో పార్థీలు లేక పిట్టలోల్లుగా వ్యవహరిస్తారు. హైదరాబాద్‌ పాత నగరంలో వీరు ఉన్న పార్థీవాడ బహు పేరెన్నిక గల ప్రాంతం. ఒకప్పుడు తెలంగాణలో పిట్టలు కొట్టడం, కుందేళ్లు-ఉడతలు- అడవిపందులను వేటాడటం ఆగిపోయింది. ఇప్పటికీ అల్లరి పిల్లలు పిట్టలను కొట్టడం, చెరువుల్లో చేపలు పట్టి అమ్ముకోవడం కనిపిస్తుంది. అయినా ప్రధానంగా వీరు ఏనాడో చిల్లర వ్యాపారంలోకి ప్రవేశించారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో పండ్లను కొని రద్దీప్రాంతాల్లో, మార్కెట్లలో నాలుగు చక్రాల బండ్ల మీద ఆడాళ్లు అమ్ముతుంటారు. మగాళ్లు సైకిల్‌ వెనుక గంప కట్టుకొని అందులో పండ్లను పెట్టుకొని వీధులెమ్మట తిరిగి అమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద గదులు లేదా ఇళ్లను కిరాయికి తీసుకొని మామిడికాయలు, సీతాఫలాలు, అరటికాయలను మగ్గబెట్టి పండ్లయిన తర్వాత తీసి రిటైల్‌గా అమ్ముతారు. ఇవి కాకుండా చాలామంది సీజనల్‌ వ్యాపారాలు చేస్తారు. పండుగలప్పుడు పూలు కుప్పలు పోసి అమ్ముతారు. వినాయక చవితికి కావలసిన పత్రిని సేకరించి అమ్మడం కూడా వీరిపనే.
మగాడితో సమానంగా ఆడవాళ్లు కూడా కష్టపడి పని చేస్తారు. వారితో సమానంగా ఎంజారు చేస్తారు. పొద్దంతా కష్టపడి పనిచేసి రాత్రి కాగానే తినడం, తాగడం, సినిమాలకు పోవడం- ఇలా ఖర్చు పెట్టేస్తారు. సినిమాల మీద మోజులో, సినిమా నటీమణుల్ని అనుకరించడం ఆడపిల్లల్లో కనిపిస్తుంది. స్కూళ్ల దగ్గర పండ్లు అమ్ముతారే తప్ప వీరి పిల్లలను స్కూళ్లకు పంపించరు. వాళ్లను చిన్నప్పటినుండే వ్యాపారంలోకి తీసుకువస్తారు. ఇప్పుడిప్పుడే వీళ్ళు కూడా ఇతర పనులలోకి కుదురుకుంటున్నారు. హావభావాలతో కూడిన తిట్లు, శాపనార్థాలతో ఎంతకూ తెగని వీరి కొట్లాటలకు ‘పిట్టలోల్ల కొట్లాట’ అనే పేరు వచ్చింది. వీరి భాషకు లిపి లేదు. సంజ్ఞలు, సంకేతాలు ఉపయోగిస్తారు. స్థానికంగా ఉన్నవారితో రాయించుకుంటారు, చదివించుకుంటారు.
తెలంగాణతో పోల్చి చూస్తే రాయలసీమలోని శికారీల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కర్నూలులో స్థిరపడిన శికారి గాళ్ళకు ఒకప్పుడు వేట ప్రధాన వృత్తి. అడవులు నశించడంతో సారాయి కాచడం, మట్కా ఆడించడం, సినిమా టాకీసుల కాడ బ్లాక్‌లో టికెట్లు అమ్మడం, ఇవేమీ చేతకాకపోతే దొంగతనాలు లేదా బిచ్చమెత్తుకోవడం చేస్తుంటారు. ఆడవాళ్లే ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించడం ఎక్కువగా కనిపిస్తుంది.
తెలుగులో మొదటిసారిగా పార్థీల జీవన విధానం గురించి సలీం 2019లో ‘అరణ్యపర్వం’ అనే నవలను రాశారు. ఇది మరాఠ్వాడా నేపథ్యంలో వెలువడినప్పటికీ, ఇది తెలుగులో రావడం వలన దీన్ని మన పరిగణనలోకి తీసుకోవచ్చు. అక్కడి పార్థీ (నీర్‌ షికారి)ల జీవితాలు ఎంత ఘోరంగా, దయనీయంగా ఉన్నాయో ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే పాణిగారు కర్నూలు ప్రాంతంలో ఉన్న నీర్‌ శికారిల బతుకులను క్షుణ్ణంగా పరిశీలించి ఇటీవలే ‘శికారి’ నవల రాయడం ఆహ్వానించదగిందే.
‘అరణ్యపర్వం’ (2019) సలీం: ఆంగ్లేయుల పాలనలో పార్థీ తెగను నేరస్తుల తెగగా ముద్ర వేసి జంతువుల్ని వేటాడినట్లు వాళ్లని వేటాడటం వల్ల, రెండు లక్షలకు పైగా ఉండిన జనాభా ప్రస్తుతానికి సగానికి పైగా తగ్గిపోయింది. భారత ప్రభుత్వం ఈ తెగను సంచార తెగగా గుర్తిస్తూ చట్టం చేసినా ఈ తెగలో నేర ప్రవృత్తి పూర్తిగా సమసి పోలేదు. పులుల్ని, ఇతర అడవి జంతువుల్ని చంపి వాటి చర్మాన్ని, ఎముకలని అమ్ముకోవడమే ఈ తెగకు జీవనోపాధి.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక క్రిమినల్స్‌ ట్రైబ్‌ చట్టం రద్దు చేయబడింది. అయినప్పటికీ పార్థి తెగ వాళ్ళందరూ దొంగలన్న మచ్చ మాత్రం మాసిపోలేదు. దానికి దోహదం చేసింది మన పోలీసు వ్యవస్థ. పార్థీ తెగ వాళ్ళు నివాసముండే ప్రదేశానికి చుట్టుపక్కల ఏ దొంగతనం జరిగినా- ఆ తెగలోని మగవాళ్ళని, ముసలీముతకా అనే భేదం లేకుండా పోలీస్‌ స్టేషన్‌కి లాక్కెళ్లి చితక బాదడం ఆనవాయితీగా మారింది. పార్థీ తెగ వాళ్ళు ఎన్నెన్ని అవమానాల్ని సహిస్తున్నారో, ఎలా ఆర్థిక, లైంగిక దోపిడీలకు గురవుతున్నారో వాటన్నింటిని వివరిస్తూ సలీం ‘అరణ్యపర్వం’ అనే నవలను రాశారు.
‘శికారి’ (2023) పాణి: గుజరాత్‌ సేట్లు, సుగాలోల్లు, పిక్కలోల్లు, శికారిలు అన్నదమ్ముల పిల్లలట. తాతల కాలం కంటే పూర్వమే ఈ కుదురు విచ్చిన్నమై ఎవరికి వారుగా మిగిలాం అంటారు వాళ్లు. మహారాష్ట్ర అడవుల్లో ఉండే శికారీలు శివాజీ సైన్యంతో పాటు కర్ణాటక మీదుగా వచ్చి ఆంధ్రలో స్థిరపడిపోయినారని చెబుతారు. ఈ చరిత్రను కుల పురాణాల ధోరణిలో భాగంగా గుర్తించవచ్చు. అలా వచ్చిన వీరు సిరిగుబ్బ, ఆదోని, కొసిగి, నాగలాపురం, పనపర్తి, కొట్టుకూరు, జోరాపురం మొదలైన ప్రాంతాలకు తరలిపోయారు. జోరాపురం వాళ్లు తిరుక్కుంటూ నేరుగా కర్నూలు పెద్ద కోర్టు కాడికి వచ్చి అక్కడ కొట్టాలేసుకుంటారు. తాక్కుంటా, అరుసుకుంటా, బజార్లో కొట్లాడుకుంట ఉన్నారని – తెల్లోళ్లు పోయినాక వచ్చిన బంగారప్ప అనే కలెక్టర్‌ ఊరికి బయట కెనాలు గట్టెంబడి జాగా చూపించి ఆడికి తోలినాడు. ఆయన పేరుమీద అది బంగారు పేట అయింది. దాంతో శికారోలు కెనాలు గట్టెంబడి ఒక వరస చిన్న చిన్న కొట్టాలేసుకుని, ఇండ్లు కట్టుకొని అక్కడే సారాయి కాచుకుంటూ, అక్కడే సంసారాలు చేసుకుంటూ ఉండిపోయారు. శికారీలకు ఆపద, అవసరం ఎప్పుడు వస్తాదా అని కనిపెట్టుకొని వారి స్థలాలను అగ్గువకు 40కి 50కి ఊరోళ్లు కొనుక్కొని వాళ్లను అక్కడి నుండి తరిమేస్తారు. ఇప్పుడు బంగారు పేటలో ఉన్న మేడలు, మిద్దెలు, షాపులు అలా వచ్చినవే.
ఊర్లు పెరిగి అడవులు పలచబడినాక శికారీ (వేట) లోనే బతకడం కష్టమైపోయింది.అక్కడిక్కడ అడక్కొచ్చుకొని తినడం, సినిమా టాకీసుల కాడ బ్లాక్‌ టికెట్లు అమ్ముకోవడం అలా సంపాదించేది తాగడానికి తప్ప పొయ్యి పెట్టి వండేది లేదు, వార్చేది లేదు.
వేటకు పోయినోళ్లు ఇంత మాంసం తీసుకుని, మిగతా వారికి తలా ఇంత పంచి ఇచ్చేటోళ్లు. అలాంటిది ఈ మధ్యనే మాంసం అమ్ముకునే వ్యాపారం మొదలుపెట్టారు. మాంసాన్ని కోసి పొనక మీద కువ్వలు పెట్టి, కువ్వ పది రూపాయల లెక్క అమ్ముకుంటుంటారు. సారాయి తయారు చేయడం, అదికూడా లేనోళ్లు ఇల్లిల్లు తిరిగి అడక్కొచ్చుకోవడం, ఎప్పుడైనా దారెంటబోయే వాడిని కొట్టి దోచుకోవడం అంతే. ఎక్సైజోళ్ళు, పోలీసోళ్ళు కేసులు పెడితే లాయర్లు సందు దొరికిందిలే అని దుడ్లు జవురుకుంటారు. వాళ్లకు ఉన్న కాడికి ఇచ్చి బయటపడటం తప్ప శికారోల్లకి ఇంకేమీ తెలవదు.
బతకడానికి కొంతమంది చిన్నా చితక దొంగతనాలకు దిగేవారు. చుట్టుపక్కల ఏ చేలో ఎవరు పంట కోసుకుపోయినా శికారోల్లే కాజేశినారని పేట మీదికి వచ్చి పడుతుంటారు. చేసిన వాటికి, చేయనివాటిని కూడా నెత్తికెత్తుకోవాల్సి వచ్చేది. దానికి ‘శికారోళ్ళ దొంగతనం’ అనే పేరు కూడా వచ్చింది. కర్నూలు దాని చుట్టుపక్కల ఊర్లలో ఒకరినొకరు దెబ్బతీయాలని అనుకునేవాళ్లు- ఎదుటి వాళ్ళ పెంపుడు జంతువులను ఎత్తుకు రావడం, కల్లాల్లో పంట కాజేయడం నేర్పిస్తారు. వాటిని అమ్మించి ఇంత చేతిలో పెట్టి, తతిమ్మాది తాము గుంజుకునేవారు. దాంతో అవతలోళ్ళు దొంగతనం చేసినోడిని, చెయ్యనోడిని కూడా కేసుల్లో ఇరికించి తిప్పలు పెట్టేవారు. వీరు దొంగతనాలు మానేసినా కేసులు పోలేదు. దొంగతనాలు చేపించిన పెద్దలే ఎదురు తిరిగి కేసులు పెట్టించేవారు. సారాయి కేసుల్లో కూడా అంతే. ఎన్టీఆర్‌ పాలన వచ్చిన తర్వాత సారా నిషేధంతో శికారీలకు మంచి రోజులు వస్తాయి. క్రమంగా వాళ్ళ పిల్లలు బ్యాండ్‌ మేళాలు వాయించడం, ఆటోలు తిప్పడం అలవాటు చేసుకుంటారు. అలా ఇతర వృత్తులలోకి వెళ్లడంతోనే వారి పరిస్థితులు కొంత మెరుగుపడతాయి.
మగాళ్లు ఎక్కడికక్కడ తాగి పడిపోతే కుటుంబాన్ని పోషించడంలో స్త్రీలే ప్రధాన పాత్ర వహిస్తారు. నాటు సారాయి కాచడం- అమ్మడం, హంద్రీలో గడ్డి కోయడం- అమ్మడం, సినిమా టాకీసుల వద్ద బ్లాక్‌ టికెట్లు అమ్మడం, భవాని గుడిలో పూజ చేయడం మొదలైన పనులన్నీ స్త్రీలే చేస్తారు. భార్యాభర్తలు తిట్టుకోవడం, కొట్టుకోవడం మామూలే.
శికారీలలో కుల కట్టుబాట్లు చాలా తీవ్రంగా ఉంటాయి. అత్యంత కఠిన శిక్షలతో పాటు జరిమానాలు కూడా ఉంటాయి. వేట భయం అనేది ఎరుగని వాళ్ళు కులం కట్టుబాట్లను దాటితే నిలువెల్లా వణికి పోతారు. వాటన్నింటినీ రచయిత నవలలో విపులంగా తెలియజేశారు. భర్త వదిలిపోతే ఒక మాదిగను పెళ్లి చేసుకున్న శికారీ యువతిని వెలివేయడం, అంటరానితనాన్ని పాటించడం విచిత్రంగా ఉంటుంది. అదే తెలంగాణలో దళితులు పిట్టలోల్లను అంటరాని వారిగా చూస్తే, పిట్టలోళ్లు దళితులను కానీ ఇతర కులస్తుల వాళ్లను కానీ అస్సలు పట్టించుకోరు.
శికారీల సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని చిత్రీకరిస్తూ పాణి ఈ ‘శికారి’ నవలను రాశారు. వేట, సారాయి, దొంగతనాల చుట్టూ తిరిగే శికారీల జీవన పోరాటం ఇందులో కనిపిస్తుంది. కాస్తంత భూమి ఉన్న శికారి గాడ్ని మోసం చేయడానికి ఉన్నత కులస్తుడైన రెడ్డి వెనుకాడడు. రాజకీయంగా, ఆర్థికంగా శికారీల కంటే ఉన్నత స్థాయిలో ఉన్న దళితుడైన దేవసహాయం శికారీల అమ్మదేవత గుడి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆర్థిక అసహాయతతో పాటు, కుల కట్టుబాట్లు కూడా వారిని కృంగదీస్తుంటాయి. శికారి జీవితాల్లో వస్తున్న మార్పులను, వారి జీవన పోరాటాన్ని పాణి ఈ నవలలో అత్యంత సహజంగా చిత్రీకరించారు.
వేట ప్రధాన వృత్తిగా ఉండే అటవిక జాతిని బీసీ ఏ లో చేర్చడం అన్యాయం. వారిని ఎస్టిలలో చేర్చాలని రాయలసీమలోని నీర్‌ షికారిలు సమైక్యమవుతున్నారు. తెలంగాణలో మాత్రం ఆ స్పృహనే లేకపోవడం ఆశ్చర్యం.

– కె.పి అశోక్‌ కుమార్‌
9700000948

Spread the love