పల్లె నుండి బయలెల్లిన విద్యాజ్యోతి

ఒకచో నేలను బవ్వలించు, నొకచో నొప్పారుఁబూసజ్జపై
నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం
బొకచో బొంత ధరించు, నొక్కొక్కతరిన్ యోగ్యాంబరశ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్’
భర్తృహరి సుభాషితానికి ఏనుగు లక్ష్మణకవి తెలుగు చేసిన పద్యమిది. కార్యసాధకుడు తన పని పూర్తయ్యే దాకా ఎన్ని కష్టసుఖాలైన ఎదుర్కొంటాడు. అవసరమైతే నేల మీద పడుకుంటాడు లేదంటే పూలపానుపుపై శయనిస్తాడు. మంచి ఆహారం దొరికితే భుజిస్తాడు లేదంటే ఉన్నదానితో తృప్తిపడతాడు. ఉంటే పట్టు వస్త్రాలు ధరిస్తాడు లేకుంటే నార వస్త్రాలను వేసుకొని సర్దుకుపోగలడు. కానీ గురిపెట్టిన లక్ష్యాన్ని మాత్రం వీడనాడడు. ఆ క్రమంలో దేనినైనా భరిస్తూ అంతిమ గమ్యాన్ని చేరుకుంటాడు. ఈ పద్యంలోని సుఖాలను తీసివేస్తే అచ్చంగా కూరెళ్ళ విఠలాచార్యకు వర్తిస్తుంది.
పసిప్రాయంలోనే తండ్రి కూరెళ్ళ వెంకట రాజయ్య (చిత్రకారుడు, ఆభరణాల శిల్పి)ని కోల్పోయి తల్లి లక్ష్మమ్మ పర్యవేక్షణలో పెరుగుతూ పల్లె ఒడిలో ఎదుగుతూ వచ్చినవాడు కూరెళ్ల విఠలాచార్య. 1938 జూలై 9 న అమ్మమ్మగారి ఊరైన నీరునెములలో జన్మించి కాలం దిద్దిన జీవనగమనంలో వెల్లంకి పల్లెలో స్థిరవాసి అయినాడు.
నీరునెములలో మసూల్ దార్, వెల్లంకిలో షేక్ అహ్మద్ అనే ఉపాధ్యాయులు తొలుత అక్షరాలు దిద్దించగా, కాలక్రమంలో శ్రీహరిరావు ఇంగ్లీష్ , కోవెల సంపత్కుమారాచార్య, అప్పలాచార్యులు సంస్కృతం నేర్పారు. అట్లా భాషాసాహిత్యాలపై పట్టు సాధించాడు.
జీవికకోసం మొదట తహసీల్ దార్ ఆఫీస్ లో కాపీ రైటర్ గా, కో ఆపరేటివ్ కి సూపర్ వైజర్ గా, సేల్స్ టాక్స్ ఆఫీస్ ఎల్ డీ సీ గా పలు ఉద్యోగాలు చేశాడు. ఈ రంగాలలో జరిగే అవినీతి తనకి నచ్చలేదు. దాంతో తన మనసును చంపుకొని పని చేయడం ఇష్టంలేని విఠలాచార్య కొంతకాలంలోనే ఉపాధ్యాయవృత్తిలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అధ్యాపకుడయ్యాడు. అంతకు మించి శిఖర సమాన సాహితీ సామాజికవేత్తగా అవతారమెత్తాడు.
చైతన్యానికి బాటలను పరిచిన తన ఉద్యమాలు:
 ఉపాధ్యాయుడిగా చేరకముందే వడాయిగుడెం అనే గ్రామంలో అక్షరాస్యతా ఉద్యమాన్ని నడిపాడు. ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేందుకు తాను రాసిన ‘సింగి సింగడు’ నాటిక కారకమైంది. దానితో పాటు రాయగిరి నాటకోత్సవాల్లో భాగంగా పలు పాత్రలు ధరించి ప్రజను చైతన్యపరిచాడు. 1954లో అస్పృశ్యతా నివారణను కోరుకుంటూ సాహసించి నీరునెములలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. 1952 లో విద్యార్థిగా నాన్ ముల్కీ ఉద్యమంలోనూ, 1969లో ఉద్యోగిగా, 2001లో కవిగా మలిదశ – తుదిదశా తెలంగాణా ఉద్యమాలలోనూ జనాన్ని పోరాటంవైపు కదిలించాడు. ఉపాధ్యాయుల ఐక్యతకై సంఘ భవనాల నిర్మాణానికి కృషిచేసాడు. పదుల సంఖ్యలో సాహిత్య సామాజిక సాంస్కృతిక సంస్థలను వివిధ వ్యక్తులతో ఏర్పాటు చేయించి గౌరవ సలహాదారుగా కొనసాగుతున్నాడు. వెల్లంకిలో ఆరు ఎకరాల భూమిని తక్కువ ధరకే ఇళ్లు లేని వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి సమర్పించాడు. ‘వూరూరా పోతన’ పేరిట యువకవులను, వాగ్గేయకారులను ప్రోత్సహిస్తున్నాడు.
అఖండ విద్యాజ్యోతిగా ‘వెల్లంకి’లో ‘ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం’ :
భువనగిరిలో చదువుతున్న కాలంలో తన తోటి మిత్రులు ఉదయం దాకా చదువుకొని పడుకుంటే రాత్రిళ్ళు విఠలాచార్య ఆ పుస్తకాలు సేకరించుకుని చదువుకొని తిరిగి వాళ్ళకప్పగించేవాడు. ఇటువంటి సందర్భాలే బహుశా కూరెళ్ళను గ్రంథాలయోద్యమం వైపు మళ్ళించాయి కావచ్చు. 1955లో వెల్లంకిలో తిమ్మాపురం వీరారెడ్డి, కణతాల నరసింహారెడ్డి, పోలు నరసింహారెడ్డి, రావీటి విఠలేశ్వరం, పున్న నరసింహ మొదలైన వారిని సమీకరించి ‘శ్రీ శంభులింగేశ్వరస్వామి’ పేరిట ఒక గ్రంథాలయాన్ని  తొట్టతొలుత ఏర్పరచాడు. కొంతకాలానికి ఆచార్య కూరెళ్ళ ట్రస్ట్ ను ఏర్పరచి ఐదువేల విలువైన గ్రంథాలతో ఫిబ్రవరి 13, 2014 న ‘ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయా’న్ని స్థాపించాడు. అలా మొదలైన ఈ విలేజ్ లైబ్రరీ నేటికీ రెండు లక్షల గ్రంథాలతో అలరారుతుంది. దీని స్ఫూర్తిగా అనేక గ్రంథాలయాలు చుట్టూ ఉన్న పల్లెల్లో ఏర్పాటుకావడం విశేషం. కొత్తగా ఏర్పాటు చేసిన లైబ్రరీలకు విఠలాచార్య వంద చొప్పున పుస్తకాలు పంపడం, ప్రతీ ఏటా ఒక  ఉత్తమ పాఠకుడికి వెయ్యి రూపాయల బహుమతి ఇవ్వడం ప్రత్యేకం. ప్రస్తుతం దాతల సహకారాలతో రెండంతస్తులుగా నిర్మితమై పల్లెల్లో విద్యావ్యాప్తికి, పట్టణాల్లో పరిశోధకులకు పట్టుగొమ్మైంది. సాహిత్యకారులకు, పోటీ పరీక్షాభ్యర్థులకు కల్పవృక్షమైంది.
ప్రధాని మెచ్చుకోలు :  
2021, డిసెంబర్ 26న ఆదివారం రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ లో కూరెళ్ళ విఠలాచార్య గురించి ‘కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని, ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 యేళ్ళ డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య మనందరికీ ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌‌గా ఉద్యోగం చేసిన విఠలాచార్య పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి ఈ రిటైర్మెంట్‌ తర్వాత లైబ్రరీని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు’ అనడం సముచితం. ఇది పల్లెదిద్దిన అక్షరానికి పట్టిన పబ్బతి.
సాహిత్యోన్ముఖుడు – పరిశోధనా దక్షుడు ఆచార్య కూరెళ్ళ :
కవిగా, రచయితగా, నాటికల కర్తగా, శాస్త్రీయత గలిగిన పరిశోధకులుగా పలు రకాలుగా సాహితీలోకంలో పేరుగాడించాడు విఠలాచార్య. చిన్ననాడే తన తాత చనిపోయినప్పుడు స్మృతికవిత్వం రాశాడు. తొమ్మిదవ తరగతిలోనే ‘గోవిలాపం’  కావ్యఖండిక రాశాడు. పాఠశాలస్థాయిలోనే ‘ఉదయ’ పత్రికకు సంపాదకుడిగా ఉండటమే గాక జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ‘ఉదయశ్రీ’ కావ్యాన్ని పోటీల్లో గెలుపొందాడు. సాహిత్య సృష్టిలో భాగంగా ‘సింగి సింగడు’ నాటిక రాయడంతో పాటు గోకారంలో ‘బాపూభారతి’ అనే లిఖిత పత్రికను, వెల్లంకిలో ‘మా తెలుగు తల్లి’ అనే కుడ్య పత్రికనూ నడిపాడు. విద్యాడ్రామా, అధికవృష్టి (జనగామ రఘునాథపల్లె రైలు ప్రమాద సంఘటన నేపథ్యంలో) అనే రచనలు సమకాలీనంగా నాడే చేశాడు.
‘పల్లియలోనె పుట్టితిని పల్లియయే నన్ను పెంచె, పల్లియే
ఇల్లును వాకిలిన్ కలిమినిచ్చె బతుక్కు మెరుంగుపెట్టె, ఆ
పల్లియె ‘అమ్మ’ ‘ఆవనుచు’ పల్కులు పల్కగ నేరిపించె, నా
పల్లియె నాకు దైవతము ప్రాణము ఓ ప్రభు విఠ్ఠలేశ్వరా!’  
అంటూ పల్లెను ఆలంబనగా చేసుకొనే తన సాహితీ సాగు పండించాడు కూరెళ్ళ. ‘విఠలేశ్వర శతకం’లోని ప్రతీ పద్యం కూడా సామాజికత, తాత్వికత అంశాలను ప్రోది చేసుకొని రాయబడింది. వ్యవస్థలోని కుటిల రాజకీయాలను , అధర్మాలను ఎండగట్టింది. 1968-84 మధ్య కాలంలో కూరెళ్ళ రాసిన వచన కవితలు ‘కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్’ గా పుస్తకరూపమెక్కినవి. ఇవి లోకంలోని దుర్నీతిని నిరసించిన కవితలు. నాటి సమాజానికి దర్పణాలు. విఠలాచార్య మరో విశిష్ట కవితా ప్రయోగం ‘దొందూ దొందే’. జీవిత సారాన్ని తెలిపే కవితలకు ఈ పొత్తం తార్కాణం.
వెల్లంకి వెలుగు, కవిరాజు ఏలె ఎల్లయ్య సంక్షిప్తచరిత్ర, ‘పంచమి’ వ్యాసాలు, ‘హైదరాబాద్  సంస్థానం : ఉమ్మడి నల్లగొండజిల్లాలో రజాకార్ల దురంతాలు’ అనే పుస్తకాలు తన చారిత్రక సజీవ దృష్టికి, ప్రాసంగీకతను కోల్పోని వాక్యానికి ప్రతిబింబాలు. శతాధిక శీర్షికలు – శతాధిక సీసాలు, నానీ నేత్రాలు వంటివి తన కవిత్వ పటుత్వానికి చిహ్నాలు. ఇవన్నీ ఒక ఎత్తైతే సాహిత్యంలో ఎవరూ పట్టించుకోని, ఎత్తుకోని ‘ తెలుగులో గొలుసుకట్టు నవలల’పై పరిశోధన చేయడం మరో ఎత్తు. ఈ గ్రంథంలో ‘గొలుసు నవలా పఠనం పఠితలోకానికి వివిధ ప్రసూనాలందించే ఒక ఉద్యానవనం’ అనేది గొలుసుకట్టు నవలలపై విఠలాచార్య సౌందర్యవంతమైన తీర్పు. ఇక తన పరిశోధనా శాస్త్రీయత-సప్రామాణికతా దృష్టికి నిలువెత్తు సాక్ష్యం తన ‘తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం’ అనే పీహెచ్ డీ గ్రంథం.
ప్రముఖకవి డా. ఏనుగు నరసింహారెడ్డి అన్నట్లు ‘ ఆశు కవిత్వం చెప్పగలగడం, పద్య కవిత్వపు అనర్గళధారా చాలా మందిలో ఉంటుంది. శుద్ధ కవులకు(pure poets) తెలుగు సమాజంలో కొరత ఉండదు. కొందరు సంస్థల నిర్మాణం పట్ల ఆసక్తి చూపుతారు. పైన చెప్పిన ఏ ఒక్క రంగంలో కాసిన్ని పేరు ప్రఖ్యాతలు వచ్చినా వాళ్ళలో వినమ్రత మాయమవుతుంది. దీనికి విపర్యయంగా ఉండగలగడమే కూరెళ్ళ విశిష్టత. సృజన సాహిత్యంలోనూ, గ్రంథాల అపరంజి మేడ కట్టడంలోనూ తపమాచరిస్తున్న యోగి డా. కూరెళ్ళ. ఆ కాలపు పోతనకు ఈ కాలపు రూపం ఆయన’. పల్లెను శ్వాసగా ధ్యాసగా భావించి భావితరాలకు పుస్తక వనరులు పల్లె నుండి పంచాలని మొదలైన ఈ అఖండ విద్యా, సాహితీ జ్యోతికి ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం వరించడం అసలైన మనిషికి సత్కారం. సిసలైన పల్లెకు జీవం.

– నర్రా ప్రవీణ్‌ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం
8179179183
Spread the love