‘ఉపాధి’ లో అన్నీ అవకతవకలే…

– రూ. 6.40 లక్షల నిధులు రికవరీ
– సామాజిక తనిఖీలో నిగ్గుతేల్చిన అధికారులు
– అక్రమాలకు పాల్పడితే చర్యలు: ఏపీడీ గోవింద రావు 
నవతెలంగాణ పెద్దవంగర:
ఉపాధి హామీ పనుల నిర్వహణలో మండలంలో  అవకతవకలు జరిగినట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల పాత భవనంలో అర్థరాత్రి వరకు ఇటీవల గ్రామస్థాయిలో నిర్వహించిన సామాజిక తనిఖీల నివేదికలపై బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో రెండున్నర ఏళ్ల కాలంలో జరిగిన రూ. 8.24 కోట్ల విలువైన ‘ఉపాధి’ పనులపై అధికారులు తిరిగి తనిఖీలు చేపట్టారు. ఈ సామాజిక తనిఖీల్లో అన్ని గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. సుమారు రూ. 6.40 లక్షలు రికవరీ చేశారు. ఉపాధి కూలీల మస్టర్ కొట్టివేతలు, రానివారికి హాజరు వేయడం, ఒకరికి బదులుగా మరొకరు పనులకు వచ్చినట్లు చూపించడం, పంట కల్లాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాల్లో కొలతల తేడాలు, హరితహారం మొక్కల తేడా, ఎవెన్యూ ప్లానిటేషన్‌ పనుల్లో మొక్కలు లేకుండా నీళ్లు పోసినట్టు సొమ్ములు చెల్లింపు..సగం మొక్కలు ఉంటే రెట్టింపు మొక్కలకు నీళ్లు పోసినట్టు..ఉపాధి కూలీల డబ్బుల విషయమై అవకతవకలు జరిగాయి. వననర్సరీలో మొక్కల పెంపకంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మొక్కలు వృథాగా పోవడంతో పాటుగా, పలు అవకతవకలు సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన సర్వేలో వెలుగు చూశాయి. దాదాపుగా మండలంలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పలు పనుల రిపోర్టులకు సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోవడం పట్ల ఏపీడీ గోవింద రావు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఆడిట్‌ సిబ్బందిని నిలదీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక తనిఖీల్లో జరిగిన అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసిన నిధులకు సంబంధించి పూర్తి రిపోర్టులు అందిన వెంటనే విచారణ చేపట్టి బాధ్యుల నుండి నిధులు రికవరీ చేయించడం జరుగుతుందని చెప్పారు. ఉపాధి కూలీలకు వంద పనిదినాలు కల్పించడంతో పాటు, వేతనం గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ మస్టర్లు వేసి అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై వేటు తప్పదన్నారు. ఉపాధి’ పనులను నాణ్యతగా, పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి పనులపై ప్రతి వారం క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్ధేశం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజావేదికలో పథకం అంబుడ్స్‌మెన్‌ ఆదాము, జిల్లా విజిలెన్స్ సహాయక అధికారి యాకూబ్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎస్సార్పీ నర్సయ్య, ఏపీఓ పార్థసారథి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఈసీలు, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love